ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్
మాజీ ఎంపీ మాలోత్ కవిత
మహబూబాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలుగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని మహబూబాబాద్ మాజీ ఎంపీ, జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు మాలోత్ కవిత విమర్శించారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ఇవ్వడంతో పాటు గ్యారంటీ కార్డుల పేరుతో పత్రాల నుంచి అవి అమలు చేయకుండా అంకెల గారడీతో ప్రజలను ఇప్పుడు మోసగించే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా, 11 డిక్లరేషన్లను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని, నమ్మి ఓట్ వేసిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని విమర్శించారు.
అంకెల గారడీ తప్ప, ఆచరణలో ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్లో కేటాయింపులు లేవని విమర్శించారు. అనేకమంది ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న వారికి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేలు కలిగించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాలకులపై నిందలు వేయడం తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోలేదన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, ముత్యం వెంకన్న, తేళ్ల శ్రీనివాస్, నాయిని రంజిత్ పాల్గొన్నారు.




