17-10-2025 12:33:28 AM
విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఈ రౌడీ హీరో ఇటీవల రవికిరణ్ కోల దర్శకత్వంలో తన కొత్త ప్రాజెక్టు ‘రౌడీ జనార్ధన’కు సైతం కొబ్బరికాయ కొట్టేసిన సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్నట్టు ఇటీవలి ముహూర్తం కార్యక్రమంతో స్పష్టమైంది. ఇలా ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికర వార్త వినవస్తోంది.
విజయ్ తాజాగా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోం ది. 13బీ, ఇష్క్, మనం, 24, హలో, గ్యాంగ్ లీడర్ వంటి ఎన్నో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలను తెరకెక్కించారు విక్రమ్ కుమార్. రెండేళ్లుగా ఏ ప్రాజెక్ట్ ప్రకటించని విక్రమ్ తాజాగా హీరో విజయ్ దేవరకొండకు కథ వినిపించారని, విజయ్ ఓకే చేశారని టాక్. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించబోతున్నట్టు సమాచారం. డైరెక్టర్ విక్రమ్.. మాలీవుడ్ నుంచి వచ్చి, ఇండియన్ సినిమాలో తన సత్తా చాటారు. టాలీవుడ్‌కు చెందిన విజయ్, మాలీవుడ్‌కు చెందిన విక్రమ్ కాంబోలో తొలిసారి రూపుదిద్దుకోనున్న ఈ సినిమా పాన్‌ఇండియా స్థాయిలో విడుదలయ్యే అవకాశం లేకపోలేదు.