17-10-2025 12:35:05 AM
‘బలగం’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు యెల్దండి. తన నుంచి రానున్న రెండో ప్రాజెక్టునూ ప్రకటించారాయన. ‘ఎల్లమ్మ’ టైటిల్‌తో ఈ కొత్త సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో చేయనున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే, హీరో విషయమై మేకర్స్ ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. కథానాయకుడి పాత్ర కోసం చాలా పేర్లే వినిపించాయి. ఒకానొక సందర్భంలో నితిన్ ఓకే అయ్యారనే టాక్ బలంగా వినిపించింది.
నాని, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్లూ చర్చకు వచ్చాయి. అయితే, ఎవరి ఊహలకూ అందని పేరును ఈ సినిమాకు హీరోగా ఫిక్స్ చేశారనేది సరికొత్త సమాచారం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలు స్తోంది. చాలా కాలంగా ప్రధాన పాత్రలో నటించాలని చూస్తున్న దేవిశ్రీప్రసాద్ ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుకు సంతకం చేశారట. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే, దేవిశ్రీప్రసాద్ అభిమానులు.. ‘గాల్లో తేలినట్టుందే’ పాటందుకోవడం ఖాయం!