17-10-2025 10:23:03 AM
హైదరాబాద్: నగరంలోని ఆసిఫ్‌నగర్ మండలం, గోషామహల్ నియోజకవర్గం(Goshamahal Constituency) పరిధిలోని కుల్సుంపూర్ విలేజ్‌లోని సర్వే నంబరు 50లో ఆక్రమణలను శుక్రవారం హైడ్రా తొలగించింది. అశోక్ సింగ్ ఆక్రమణలో ఉన్న మొత్తం 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు(Hydra demolitions) స్వాధీనం చేసుకున్నారు. హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూమి విలువ రూ. 110 కోట్లు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అశోక్ సింగ్ అందులో తాత్కాలిక షెడ్డులు వేసి విగ్రహతయారీదారులకు అద్దెకు ఇస్తున్నాడు. స్థలాన్ని కబ్జా చేసిన విషయాన్ని తెలుసుకున్న హైదరాబాద్ కలెక్టర్ కుల్సుంపురలో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైడ్రాను కోరారు. ఆ స్థలాన్ని ప్రజావసరాల కోసం వినియోగించాలని ప్రభుత్వ ఆలోచన ఉంది. గజం స్థలం కూడా దొరకని కుల్సుంపురలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలనే తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ కబ్జా బాగోతంపై స్థానికులు హైడ్రాకు ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించించారు. అనంతరం ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. స్థలం తన భూమిగా పేర్కొంటూ అశోక్ సింగ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రెవెన్యూ అధికారులు ఇప్పటికే రెండు సార్లు ఆక్రమణలను తొలగించినట్లు తెలిపారు. అయినా ఆ స్థలం ఖాళీ చేయకుండా అశోక్ సింగ్ అద్దెలు అనుభవిస్తున్నాడని, ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై అశోక్ సింగ్ దాడులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే అశోక్ సింగ్‌పై వివిధ పోలీసు స్టేషన్లలో భూ కబ్జాదారుడుగా, రౌడీ షీటర్‌గా పేర్కొంటూ పలు కేసులున్నాయని హైడ్రా అధికారులు తెలిపారు. లంగర్‌హౌస్, మంగళహాట్, శాహినాయత్‌గంజ్ పోలీసు స్టేషన్లలో అశోక్ సింగ్‌పై 8కి పైగా కేసులున్నాయని అధికారులు వివరించారు. ఇదే ప్రభుత్వ భూమికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తెలంగాణ ప్రబుత్వం పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది.