2 July, 2026 | 6:49 AM

మార్కెట్లో రికార్డుల హోరు

24-05-2024 12:15 AM

చరిత్రాత్మక గరిష్ఠాలకు స్టాక్ సూచీలు 

సెన్సెక్స్ 1,200 పాయింట్ల పరుగు

23,000 పాయింట్ల సమీపానికి నిఫ్టీ

ఆర్బీఐ రికార్డు డివిడెండుతో ఈక్విటీలకు ఊపు

కదం తొక్కిన బ్యాంకింగ్, ఆయిల్, ఆటో షేర్లు

ఎఫ్‌పీఐల భారీ షార్ట్ కవరింగ్

ముంబై, మే 23: ఎన్నికల ఫలితాల పట్ల ఆందోళనతో ఇప్పటివరకూ ప్రపంచ మార్కెట్లకంటే వెనుకబడిన భారత్ స్టాక్ సూచీలు గురువారం ఒక్క ఉదుటన పరుగులు పెట్టాయి. సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.  రిజర్వ్‌బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి రికార్డుస్థాయిలో రూ.2.11 లక్షల డివిడెండు చెల్లించాలని నిర్ణయించడం తాజా ర్యాలీని పురికొల్పింది. అటుపై వీక్లీ డెరివేటివ్ సెటిల్‌మెంట్ రోజైనందున విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరపడంతో స్టాక్ సూచీలను చరిత్రాత్మక గరిష్ఠస్థాయిలకు చేరాయి.బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,197 పాయింట్లు ఎగిసి 75, 418 పాయి ంట్ల వద్ద ముగింపులో సరికొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే  677 పాయింట్ల లాభంతో 73,664 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 1,278 పాయింట్లు పెరిగి 75.500 పాయింట్ల రికార్డుస్థాయిని సైతం తాకింది. ఈ ఏడాది జనవరి తర్వాత ఒకే రోజున సెన్సెక్స్ ఇంత పెద్ద ర్యాలీ జరపడం ఇదే ప్రధమం.  ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  ఇంతవరకూ చూడని 23,000 మైలురాయి సమీపానికి చేరింది. నిఫ్టీ ఇంట్రాడేలో 396 పాయింట్ల ర్యాలీ జరిపి 22,993 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. చివరకు 370 పాయింట్ల లాభంతో 22,967 పాయింట్ల జీవితకాల గరిష్ఠస్థాయి వద్ద ముగిసింది. దాదాపు ఆరు నెలల తర్వాత నిఫ్టీ ఇంతగా పెరగడం ఇదే ప్రధమమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. అలాగే ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరిందన్నారు. 

ఆర్బీఐ డివిడెండు ఎఫెక్ట్

రిజర్వ్‌బ్యాంక్ రికార్డుస్థాయిలో రూ.2.11 లక్షల కోట్ల డివిడెండు చెల్లింపు పరోక్షంగా వడ్డీ రేట్ల తగ్గింపులాంటిదేనని, దీనితో బాండ్ ఈల్డ్స్ తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు. ఫలితంగా బ్యాంకింగ్, ఆయిల్, ఆటో షేర్లలో వువ్వెత్తున జరిగిన కొనుగోళ్లతో మార్కెట్ కదం తొక్కిందన్నారు. దేశంలోకి రుతుపవనాలు త్వరితంగా ప్రవేశిస్తాయన్న వాతా వరణ సంస్థల అంచనాలూ మార్కెట్‌కు ఊపునిచ్చిందని నాయర్ వివరించారు. ఇతర వర్థమాన మార్కెట్లకంటే గత రెండు నెలలుగా వెనుకబడిన దేశీయ మార్కెట్‌కు ఈ వార్తలు టానిక్‌లా పనిచేశాయన్నారు. 2024 మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి రూ.2.11 లక్షల కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి చెల్లించేందుకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రెట్టింపు. ఆర్బీఐ రికార్డు డివిడెండు మెరుగైన ద్రవ్య పరిస్థితిని సూచిస్తున్నదని, రానున్న రోజుల్లో బాండ్ ఈల్డ్స్ తగ్గుతాయని, ఫలితంగా నిఫ్టీ ఇండెక్స్ రికార్డు గరిష్ఠానికి దూసు కెళ్లిందని స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా చెప్పారు. 

ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం జంప్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా లార్సన్ అండ్ టుబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రాలు 3.64 శాతం, 3.54 శాతం చొప్పున పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ 3.3 శాతం లాభపడింది.  మారుతి, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.5 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. మరోవైపు సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీలు నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా ఆటోమొబైల్ ఇండెక్స్ 2.28 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.13 శాతం, బ్యాంకెక్స్ 1.98 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచి 1.64 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.63 శాతం, టెక్నాలజీ సూచి 1.42 శాతం, కన్జూమర్ డిస్క్రీష నరీ ఇండెక్స్ 1.19 శాతం, ఐటీ ఇండెక్స్ 1.18 శాతం చొప్పున పెరిగాయి. మెటల్ ఇండెక్స్ నష్టంతో ముగిసింది. స్మాల్ క్యాప్ సూచి 0.27 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.58  శాతం చొప్పున పెరిగాయి.

రూ.4. లక్షల కోట్లు పెరిగిన సంపద

తాజా మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.28 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,28,602 కోట్లు ఎగిసి రూ.4,20,22,636 కోట్ల రికార్డుస్థాయికి చేరింది. ఇప్పటికే డాలర్ల రూపంలో ఈ విలువ 5 ట్రిలియన్లకు పెరిగిన సంగతి తెలిసిందే.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు రూ.4,670 కోట్లు

స్టాక్ సూచీల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కొద్ది రోజులుగా భారీ అమ్మకాలు జరుపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) గురువారం మాత్రం ఒక్క రోజులోనే రూ.4,670 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేసినట్టు  స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలలో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి రూ. 30,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకోగా, ఎంతో కాలం తర్వాత ఈ గురువారం భారీ కొనుగోళ్లు జరపడం గమనార్హం.