2 July, 2026 | 8:14 AM

కొత్త ప్రభుత్వానికి భారీ నజరానా

23-05-2024 12:05 AM

కేంద్రానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండు

రిజర్వ్‌బ్యాంక్ బోర్డు అనూహ్య నిర్ణయం

న్యూఢిల్లీ, మే 22: విశ్లేషకులు వూహకు అందనంత భారీ బహుమతిని కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ఇచ్చేందుకు రిజర్వ్‌బ్యాంక్ సిద్ధమయ్యింది. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండును రిజర్వ్‌బ్యాంక్ బోర్డు ఆమోదించింది. కేంద్రానికి రూ. 1 లక్ష కోట్లు బదిలీ చేయవచ్చన్న అంచనాల్ని పలు విశ్లేషణా సంస్థలు వెల్లడించాయి. ఈ అంచనాలకు రెట్టింపుపైగా మొత్తాన్ని కేంద్ర ఖజానాకు బదిలీ చేయాలంటూ ఆర్బీఐ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నది. గత 2022 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి బదిలీ చేసిన రూ.87,416 కోట్లకు తాజాగా వెల్లడించిన మొత్తం 141 శాతం అధికం. ఆర్బీఐ కార్యకలాపాల ద్వారా ఒనగూడే మిగులును ప్రతీ ఏడాదీ కేంద్రానికి బదిలీ చేస్తుంది. దీనినే డివిడెండుగా వ్యవహరిస్తారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశం బుధవారం ముంబైలో జరిగింది. అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక స్థితిగతుల్ని, రిస్క్‌లను చర్చించిన బోర్డు రూ.2,10,874 కోట్ల మిగులును కేంద్రానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. 

పెరుగుదలకు కారణం

ఆర్బీఐ వడ్డీ ఆదాయం, విదేశీ మారకం లాభాలు గణనీయంగా ఉన్నందున, ఈ ఏడాది కేంద్రానికి చెల్లించే డివిడెండు పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తూ వచ్చారు. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో విదేశీ కరెన్సీ ఆస్తులు 70 శాతం, ప్రభుత్వ బాండ్లు 20 శాతం మేర ఉంటాయి. ఈ సెక్యూరిటీల నుంచి ఒనగూడే వడ్డీ ఆదాయం రూ.1.51 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా.  మరోవైపు ఆర్బీఐ వద్దనున్న విదేశీ మారక ఆస్తుల నుంచి వడ్డీ ఆదాయం గణనీయంగా పెరగడంతో కేంద్రానికి భారీ డివిడెండు చెల్లించగలుగుతున్నదని భావిస్తున్నారు. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పలు దఫాలు వడ్డీ రేట్లు పెంచిన ప్రభావంతో డాలర్ ఆస్తుల ద్వారా ఆర్బీఐకి వడ్డీ ఆదాయం బాగా పెరిగిందని విశ్లేషకులు తెలిపారు. దేశీయ, విదేశీ బాండ్లపై ఉన్న అధిక వడ్డీ రేట్లు, గత ఏడాదికంటే విదేశీ మారకం స్థూల విక్రయం పెరగడం ఇంతటి భారీ డివిడెండుకు కారణమై ఉండవచ్చని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ ఉపాసన భరద్వాజ్ వివరించారు. కంటింజెన్సీ రిస్క్ బఫర్‌ను పెంచినప్పటికీ, అధిక డివిడెండు చెల్లించాలని నిర్ణయించడం గమనార్హమని తెలిపారు. 

సీఆర్‌బీ పెంపు

ఆర్బీఐ తన బ్యాలెన్స్‌షీట్‌లో 5.5 శాతం కంటింజెన్సీ రిస్క్ బఫర్ (సీఆర్‌బీ)గా అట్టిపెట్టుకుంటుంది. బాండ్ల విలువ తగ్గుదల, కీలక పాలసీ రేట్లు/మారకపు రేట్లలో హఠాత్ మార్పులు, ఇతర పాలసీ రిస్క్‌లు వంటివి ఏర్పడితే సీఆర్‌బీ రిజర్వ్‌బ్యాంక్‌కు తోడ్పడుతుంది. 2018 నుంచి 2021 మధ్యకాలంలో వృద్ధికి ఊతం ఇచ్చేందుకు రిజర్వ్‌బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్‌లో 5.50 శాతం సీఆర్‌బీగా కొనసాగించాలని బోర్డు నిర్ణయించగా, కొవిడ్ తదనంతరం 2023 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో సీఆర్‌బీని 6 శాతానికి ఆర్బీఐ బోర్డు పెంచింది. 2024 ఆఇ్థక సంవత్సరంలో దీనిని మరింతగా పెంచి 6.5 శాతానికి చేర్చినట్లు ఆర్బీఐ బోర్డు విడుదల చేసిన ప్రకటన తెలిపింది.

బడ్జెట్ అంచనాల్ని మించి..

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఓట్ ఆన్ అకౌంట్‌లో  2024 ఆర్థిక సంవత్సరంలోఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.1,02,000 కోట్ల డివిడెండును  నిర్దేశించింది. ఒక్క ఆర్బీఐ నుంచే ఇంతకు రెట్టింపు మొత్తం అందనున్నందున నిర్దేశిత 5.1 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని కేంద్రం సులభంగా చేరడమే కాకుండా, మరింత తగ్గించుకునే అవకాశం కూడా కలుగుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమర్పించే పూర్తిస్థాయి బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని మార్చే అవకాశం ఉన్నది. అంతేకాకుండా రిజర్వ్‌బ్యాంక్ నుంచి అందే మొత్తం పెరిగినందున,  వ్యయాల కోసం కొత్త ప్రభుత్వం చేతిలో అధిక మొత్తం ఉంటుంది.  ఆర్బీఐ నుంచి అందే భారీ మొత్తం కారణంగా 2024 ద్రవ్యలోటు 0.4 శాతం మేర తగ్గవచ్చని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ భరద్వాజ్ అంచనా వేశారు. రానున్న బడ్జెట్లో మార్కెట్ నుంచి రుణ సమీకరణను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. ఇది బాండ్ మార్కెట్లకు ఎంతో ఊరటనిస్తుందని భరద్వాజ్ వ్యాఖ్యానించారు.