ఓ నగర ప్రయాణం
నగరంలో నేను నడుస్తున్నాను
అపరిచిత ముఖాల స్వరాల నన్ను చుట్టేస్తుంది,
ఒక్క ముఖం కూడా
నా ఆత్మీయస్పర్శలాగా అనిపించదు.
ఎన్నో సంవత్సరాలు గడిచిన తరువాత కూడా,
ఇక్కడ నేను పర్యాటకుడిగా మిగిలిపోతాను.
ప్రతి ఉదయం
అందరూ పరుగుపందెంలో పోటీ పడతారు
వాహనాల హోరు, హారన్ల జోరు
ఏదో తెలియని ఆతురత,
గమ్యం వెతుకుతూ సాగిపోతున్న జీవితం.
అయినా.. నాకు ఈ నగరం సుపరిచతమే
రోడ్ల పేర్లు, కూడళ్ల మలుపులు,
కొత్త రంగులు పులుముకుంటున్నాయి.
నిన్నలో గతించిన గుర్తులు
ఎండ కాచినప్పుడూ వర్షం పడినప్పుడు
చెట్ల కింద నిశ్శబ్దంగా ఉండే నీడలు
ఇవన్నీ నా జ్ఞాపకాలలో నిలిచిపోయాయి.
కానీ, ఇప్పుడు ఈ జనసంద్రంలో
ప్రతి ముఖం ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.
ఎవరైనా చిరునవ్వును విసురుతారు
మరొకరు కోపాన్ని దులుపుతారు
అపరిచిత ముఖాలతో ఎదురు పడినప్పుడూ
అనుమానంతో అనేక ప్రశ్నలు దడి కడతాయి.
కొన్ని సందర్భాలు
ఎలాంటి స్పర్శలు లేని సంభాషణలతో.
వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది
జాలి, దయ, కరుణ వెలిసిపోయిన మాటలు
ఇక్కడ.. ఎవరి పోరాటంలో
వాళ్లు నిమగ్నమయ్యారు.
అలలా వారు ఎగసి పడుతూ ప్రవహిస్తారు.
నాలుగుదారుల రద్దీ మధ్యన
సిగ్నల్ రంగులు అడ్డు తగులుతుంటాయి.
అంతరాయానికి చింతిస్తున్నామన్నట్లుగా
ట్రాఫిక్ ఓచోట నిలిచిపోతుంది
కొద్ది క్షణాలు ఊపిరి స్తంభిస్తుంది.
నియమాలు, నిబంధనలు మరచిపోతారు
ద్వేషిస్తూ, శపిస్తూ దహించిపోతారు.
అందరికి అన్నీ తెలుసు.. కానీ
ఆచరణ మాత్రం అరణ్యరోదన.
ఎన్నెన్నో జ్ఞాపకాల జలపాతాలు ఇంకిపోయి
ఇప్పుడు.. ఈ నగరం
దుమ్ము ధూళితో మసక బారుతుంది
కాలుష్యంతో ఊపిరి మింగుతుంది,
ఆర్భాటాల కోలహలంతో ఊరేగుతుంది.
ఇది ఒక అలసిన నగరం
శృతి తప్పిన సంగీత స్వరం.
దారులు దారులుగా విడిపోయి
దూరాలు పెరుగుతున్న నగరం.
మానవత్వం జాడ లేని జన సంచారం.
ఇది సేద తీరడం మర్చిపోయింది
శ్వాస తీయడం మర్చిపోయింది
మృదుత్వాన్ని మరచిపోయింది.
ఇప్పుడు నేను దీన్ని గుర్తు పడతాను.
గత చరిత్రను తొవ్వుతూ
నిన్నటి తరం కథలు కథలుగా చెబుతున్నప్పుడూ
నగరాన్ని చదువుతుంటాను.
ఐనా, ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో
నా అడుగులతో సంతకం చేస్తూ
నగరం అందాలను వెతుకుతుంటాను.
అంతా కృత్రిమంగానే వుంది
ఈ నగరం
నాకు తెలిసిన నగరం కాదు.
ఇది ఒక మసకబారిన కల
ధూళిలో మిగిలిపోయిన గుర్తు మాత్రమే.
పాత తరం నగరం మీద కన్నీటి చుక్కై
ఈ నగరం శృతి తప్పిన స్వరంలా వుందని
చరిత్రను గుర్తు చేసి నిట్టూర్పులు విడుస్తారు
నిన్న నగరం పల్లకిలో ఊరేగిన
అదృష్టవంతులు వాళ్లు ?!
నేను మాత్రం ఈ నగరానికి
అపరిచిత ముఖచిత్రమే
నలుగురిలో నడుస్తున్నప్పుడూ!
బొల్లిముంత వెంకటరమణారావు






