అకుంఠిత విష్ణుభక్తి తత్పరుడు రెడ్రెడ్డి మల్లారెడ్డి
“శ్రీగోపీ వదనారవింద మధుర
శ్రీరంజిత స్వాంతు నా
వాగీశ ప్రముఖామరార్చిత పదద్వంద్వున్ గృపాంభో నిధిన్
భోగీశైక శయానుడై వెలుగు నంభోజాత నేత్రున్ హరిన్
శ్రీగంగాపుర కేశవప్రభువు నే
సేవింతునశ్రాంతమున్”
అని గంగాపుర చెన్నకేశవస్వామిని సేవి స్తూ పద్యం రచించిన కవి రెడ్రెడ్డి మల్లారెడ్డి. ఈయన రచించిన ‘గంగాపుర మాహాత్మ్యం’ అనే నాలుగు ఆశ్వాసాల పద్య కావ్యంలోని ఈ మొదటి పద్యమే ఆయన విష్ణుభక్తిని తెలియజేస్తున్నది. గంగాపురంలో కొలువై వున్న చెన్నకేశవస్వామి రెడ్రెడ్డి మల్లారెడ్డి కవికి ప్రీతికరమైన దైవం. ఈ గంగాపుర పాలకునిగా మల్లారెడ్డి దేశాయి స్వయంగా కవికూడా కావ డం వల్ల తన ఇష్ట దైవాన్ని స్తుతిస్తూ, తాను పాలించే గంగాపుర మాహాత్మ్యాన్ని చక్కని పద్యకావ్యంగా రచించి తెలుగు కవిత్వప్రియులకు అందించాడు.
గంగాపుర చెన్నకేశవుని భక్తుడైన మల్లారెడ్డి తనను గురించి చెప్పుకుంటూ
“కోనమధవుడను రంగ
క్ష్మానాథుని కూర్మిసుతుడ కమలాక్షపద
ధ్యాన గరిష్ఠుడ మహి వి
జ్ఞానానందైక రతుడ సజ్జన హితుడన్”
అన్నాడు. అంటే, తన తండ్రి రంగారెడ్డి అని, విష్ణుభక్తుడనని చెబుతూనే, తాను సజ్జన హితుడనని కూడా చెప్పుకోవడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతున్నది.
లోకహితుడు కూడా!
కేవలం భక్తి వరకే తాను పరిమితం కాకుం డా లోకానికి ఉపయుక్తుడు, హితం చేకూర్చే వానిగాకూడా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఈ కవి. సాధారణంగా రెడ్లలో మో టాటి రెడ్లని, పాకనాటి రెడ్లని గుడాటి రెడ్లని అనేక భేదాలున్నాయి. మల్లారెడ్డి మోటాటి రెడ్లకు సంబంధించిన వాడు. ఈ కావ్యావతారికలో తమ పూర్వులను గురించి విపులంగా వివరించాడు.
“ప్రోల్వాల గోత్ర సంపూర్ణాభి చంద్రుండు
మల్ల భూనాథుండు మాన్యవరుడు”
.. అన్న పద్యంలో
“ఖుతుబుషాహ నరేంద్రు చే కోర్కెలలర
అందలంబును తశ్రీవు లందుకొనుచు
సరస బూర్గుల పట్టణ చౌధరగుచు
ప్రజల పాలించె భూభుజుల్ ప్రస్తుతింప”
అని కవి తన పెదతాతను గురించి చెబు తూ, ఆ పెదతాత మల్లారెడ్డి కుతుబ్‌షాహి రాజునుంచి ఎన్నో గౌరవాలను అందుకున్నాడని, బూర్గుల పట్టణ ‘చౌదరి’గా ప్రజారంజ కంగా, ప్రజలు ప్రస్తుతించగా పరిపాలించినాడని పేర్కొన్నాడు. ఈ పద్యంలో ‘చౌదరి’ అన్న ప్రయోగం జరిగింది. ‘చౌదరి’, ‘దేశా యి’, ‘దేశముఖ్’ వంటి పదజాలాలు మహారాష్ట్ర ప్రాంతం నుంచి తెలుగులోకి వచ్చాయి.
అంటే, మన ప్రాంతానికి, మహారాష్ట్ర ప్రాంతానికీ (శివాజీ (1627-1680) తరువాత) అనేక సంబంధాలు ఏర్పడ్డాయని సాహిత్య చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు. దీన్నిబట్టి కవి తాత మల్లారెడ్డి 1650-1700 మధ్య కాలం వాడు అయివుండవచ్చునని ఆచార్య ఎస్.వి.రామారావు అభిప్రాయపడ్డారు.
స్కాంద పురాణాంతర్గత కథ
గంగాపురం ప్రాచీన చరిత్ర కలిగిన గ్రా మం. మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల గ్రామానికి మూడు మైళ్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. ఎక్కడ చూసి నా చాళుక్య శాసనాలు, పలు శిథిలాయాలు, విగ్రహాలు ఈ ప్రాచీన క్షేత్రంలో దర్శనమిస్తుంటాయి. ఇక్కడి ఆలయ పునరుద్ధరణ చేసిన ‘వీరగంబాళుడు’ (వీర హెంబాళుడు) అనే చాళుక్య రాజును గురించి మల్లారెడ్డి తన కావ్యావతారికలో ప్రస్తుతించాడు. తన కావ్యావతారిక లోనే కవి ఈ కథ స్కాంద పురాణాం తర్గతమైందని చెబుతూ, ఈ గ్రామానికి ఒక్కో యుగంలో ఒక్కో పేరున్నట్టు పేర్కొన్నాడు.
ఈ గ్రామానికి కృతయుగంలో‘మత్స్యపురమ’ని, త్రేతాయుగంలో ‘దురిత కోలాహల మ’ని, ద్వాపరయుగంలో ‘మాయాపురమ’ ని, కలియుగంలో ‘గంగాపురమ’ని పేర్లున్న ట్లు ఒక ప్రత్యేక పద్యంలో స్పష్టంగా తెలిపాడు. ఈ ప్రాచీన క్షేత్ర ప్రాశస్త్యాన్ని చెప్పే ఈ కావ్యావతారికలోని దైవస్తుతిలో విష్ణుభక్తి తత్పరుడైన రెడ్రెడ్డి మల్లారెడ్డి గరుడాళ్వారును, ఆదిశేషువును, నమ్మాళ్వారును, శ్రీభాష్యకారుని, వైష్ణవ మతాచార్యులను నుతించాడు.
విపులంగా గంగాపుర చరిత్ర
1946లో సుప్రసిద్ధ పరిశోధకులు, గొప్ప విద్వన్మూర్తి కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి తమ ‘విజ్ఞానవర్ధిని’ సంస్థ ప్రచురణగా ఈ కావ్యా న్ని పరిష్కరించి ముద్రించి తెలుగు సాహితీ లోకానికి గొప్పనైన కానుకను ప్రసాదించాడు. దీనికి విపులమైన పీఠికను సంతరించి పెట్టిన సురవరం వారు అక్కడి ఆలయ నిర్మా ణ విశేషాలు, అక్కడ లభించిన శాసనాల వివరాలు, నాటి ప్రజల జీవన విధానాలు, రాజ్యా న్ని పరిపాలించిన పాలకుల విశేషాలు వంటి అనేక చారిత్రకాంశాలను పేర్కొని ఈ కావ్య ప్రాముఖ్యాన్ని పాఠకులకు తెలియజెప్పారు.
కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి పరిష్కరించి ప్రకటించిన ఈ కావ్య పీఠికలో అనేక చారిత్రకాం శాలను, గంగాపుర చరిత్రను కూడా విపులం గా తెలిపారు. ఈ గ్రామానికి మైలు దూరం లో ‘గొల్లత్త గుళ్లు’ ఉన్నాయని ఈ నిర్మాణాల చరిత్రను, వీటి పుట్టు పూర్వోత్తరాలను గురిం చి చెబుతూ అవి ‘గోళకీ మఠాలు’ అయిఉం డవచ్చునన్న విషయాన్ని పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రాంతర్గత విశేషాల ను సోదాహరణంగా వివరించారు.
గొల్లత్త గుళ్ల ప్రస్తావన
ఈ గ్రామానికి ఉన్న పేర్లలో ‘మాయాపురి’ పేరును గురించి వివరించి, దీనికీ ఇక్కడున్న శైవాలయం వెనుక కనిపించే జైన విగ్రహానికి ఉన్న సంబంధాన్ని గురించికూడా మల్లారెడ్డి కవి పేర్కొన్నారు. ‘గొల్లత్త గుళ్ల’ను గురించిన స్థానిక కథనాలకు ప్రాధాన్యాన్ని ఇచ్చి ప్రస్తావించారు.
ఈ సందర్భంలోనే వెంగయ్య కవి రచించిన ‘నరపతి విజయము’ను నామాంతరం కలిగిన ‘రామరాజీయము’ అనే కావ్యం లో ప్రసక్తిని ప్రస్తావించి ఈ నిర్మాణాల ప్రాచీనత విషయాన్ని చర్చించారు. ఇక్కడి చెన్నకే శవాలయం చాళుక్యుల వైష్ణవాభిమానం కారణంగా సుమారు క్రీ.శ. 1000 సంవత్సరంలో వారితో నిర్మితమై ఉంచవచ్చునని భావించారు.
గుడి బయటి గోడలపై వున్న చాళుక్య రాజులు వేయించిన శాసనాల వివరాలను కూడా వివరించారు. అంతేగాక ఈ గ్రామంలోని చౌడీశ్వరాలయ విశేషాలను, దాని సమీపంలో ఉన్న పెద్ద చెరువును గురించి, అక్కడి పది, పన్నెండు కుంటలను గురించి కూడా సవివరంగా పేర్కొన్నారు. స్థల పురాణంలో ఇక్కడి పవిత్ర నదీ ప్రస్తావన ఉన్నట్టు చెప్పారు.
మీనాంబరి వాగు ప్రసక్తి
ఈ గ్రామానికి కొద్ది దూరంలో ‘మీనాంబ రి’ అనే వాగు ప్రసక్తిని కూడా తెచ్చారు. దాని తీరంలో పలు శివలింగాలు, ఒక శివాలయంతోపాటు ఉన్నట్లు పేర్కొంటూ, పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’లో ప్రస్తావించిన ‘సహస్రగణ’ శివభక్తుల వర్ణన ను తెలుపుతూ, ఈ గంగాపురాన్ని శివకేశవాలయాలు కలిగిన పవిత్రక్షేత్రంగా పేర్కొన్నారు.
ఈ విషయాలన్నీ మల్లారెడ్డి దేశాయి కా వ్యం ద్వారా వెలుగులోకి తెచ్చారు సురవరం వారు.
“గంగా వాహిని పేరిట
గంగాపురమనగ వెలసె గహ్వరి మీదన్
రంగత్కేశవ గౌహము
సంగతితో భుక్తిముక్తి సంవత్ప్రదమై”
అంటూ ఈ గ్రామ పవిత్రతను, ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని చెప్పిన రెడ్రెడ్డి మల్లారెడ్డి చక్కని కవిత్వ ప్రతిభ కనచరిచిన కవి.
ప్రబంధ కవుల పద్ధతిలోనే వర్ణనలు
ఆ విషయాన్నే సురవరం వారు పేర్కొం టూ “ఇతని కవిత చక్కని ధారాశుద్ధి కలిగినట్టిది. శైలి సరళమైనది. వర్ణనలన్నియు ప్రబంధ కవుల పద్ధతిలోనే యున్నవి. పురవర్ణన, స్త్రీ వర్ణన, విరహతాపము మున్నగువన్ని యు ఉన్నాయి” అని తన పీఠికలో ప్రశంసించారు. పరమ వైష్ణవ భక్తి తత్పరుడైన ఈ కవి గురువు ‘తిరుమల ఔబళ రాయడు’ అన్న విషయం ఆయనే అవతారికలో
“...బహుళ తరకీర్తి మద్గురు భవ్యమూర్తి
తిరుమలౌబళ ధన్యు హృత్పీఠి నిలిపి”
అని చెప్పుకున్న మాటలనుబట్టి తెలుస్తున్నది. ప్రతి సంవత్సరం అయిదు రోజుల పాటు మాఘశుద్ద సప్తమి మొదలు నిర్వహిం చే విశేష జాతర జరుగుతున్న విషయాన్ని కూడా ప్రతాపరెడ్డి వివరించారు. ఈ కవిత్వ నిర్మాణ ప్రతిభను పేర్కొంటూ సాయం వర్ణనకు సంబంధించిన ఒక చక్కని పద్యాన్ని ఆయన ఉదాహరించాడు.
“కాలవ్యాధుడు వెంటనంటి దరుమన్ గంజాప్త సారంగమున్
చాలం దవ్వుగ నేగ తీవ్రశరమున్ సంధించి బిట్టేయున
ట్లోలిం బశ్చిమ వార్ధి వ్రాలునటులీ యుగ్రాంశుడు గ్రుందె ద
త్కాలాలంబన సాంధ్యరాగమమరన్ గెంపెక్కిన ల్దిక్కులన్”
అన్న పద్యాన్నిబట్టి మల్లారెడ్డి ఊహావైభ వం, వర్ణనా సామర్థ్యం ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పద్యంలోని పురవర్ణన గాని, ఋతువర్ణన గాని వినూత్న రీతిలో ఈ కవి చేసిన విధానం కావ్య పాఠకుల అంతరంగాలను ఆనంద డోలికల్లో ముంచుతుం దన్నది కాదనలేని సత్యం.
చాళుక్యరాజుల విశేషాలు
మన తెలుగునేలపై పాలకులుగా ఉండి, సమర్థమైన పాలన కొనసాగిస్తూ నే సాహిత్య వ్యవసాయం కొనసాగించి అపురూప కావ్య ఫలాలను అందించిన కవులు అనేకులు ఉన్నట్లు సాహిత్య చరిత్రలు తెలుపుతున్నాయి. పాలకులు కొన్ని సామాజిక విశేషాలు కాని, తమ స్వవిషయం వల్ల కాని చారిత్రకాంశాలను గురించి కాని చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
మల్లారెడ్డి కావ్యావతారికలో పలు చారిత్రకాంశాలు, ముఖ్యంగా చాళుక్య రాజుల వివరాలు పేర్కొనడం వల్ల ఆ విశేషాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయాలన్నీ ప్రత్యేక శీర్షికల ద్వారా కీ.శే. ప్రతాపరెడ్డి పీఠికలో తెలిపారు. ఈ కావ్య ప్రాముఖ్యాన్ని సవివరంగా వివరిస్తూ, రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయి ఘనతను చాటి చెప్పారు.
గన్నమరాజు గిరిజా మనోహరబాబు
9949013448






