12 May, 2026 | 1:22 AM

గిరిబిడ్డల వైద్య సేవలపై శీత కన్ను

12-05-2026 12:00 AM

నర్సులు, వార్డు బాయ్ లతోనే వైద్యం

మొక్కుబడిగా వైద్య సేవలు 

గోలేటి డిస్పెన్సరీపై నిర్లిప్తత 

పట్టించుకోని కార్మిక సంఘాలు

బెల్లంపల్లి, మే 11: అవసరముంటే ఓడమల్లన్న.. అవసరం తీరీనాక బోడి మల్లన్న... చందంగా ఉంది సింగరేణి అధికారుల తీరు. ఓపెన్ కాస్ట్ నిర్వాసిత గిరిజనుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గోలేటి డిస్పెన్సరీ పరిధిలోని గోలేటి, తీర్యాణి పరిసర గిరిజన గ్రామాల ప్రజలకు ప్రతినిత్యం సింగరేణి యాజమాన్యం ఉచితంగా వైద్య సేవలు అందించాలి.

అది వారి కనీస బాధ్యత. సింగరేణి కంపెనీ గిరిజనులకు వైద్య సేవలు అందించడమేంటి? అనే ప్రశ్నలు ఎవరికైన ఉదయించవచ్చు. గోలేటి, తిర్యాణి గిరిజనులు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కోసం తమ జీవితాలను దార బోశారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ లకు గిరిజనుల జీవితాలను బలిచ్చారు. అందుకు పరిహారం కింద కొంత డబ్బులు ఇచ్చారు. గిరిజనులకు నిత్యం మెడికల్ క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందిస్తామని ఒప్పందం చేసుకున్నారు.

అందులో భాగాంగానే సింగరేణి యాజమాన్యం గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నది. మొదట్లో కొంతకాలం వైద్య బృందం గ్రామాల్లోకి వెళ్ళి వైద్య సేవలు అందించేవారు. రాను రాను వైద్య సేవల్లో నిర్లక్ష్య ఆవరించింది. అందుకు వైద్యుల నిర్లక్ష్యం కాదు.. గోలేటి డిస్పెన్సరీలో పనిచేస్తున్న వైద్యలు, సిబ్బందిని బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి సేవలకు వినియోగిస్తున్నారు. ఫలితంగా వైద్య సేవల్లో కొరత ఏర్పడింది.

సాధారణంగా ఏరియా ఆసుపత్రి నుంచి వైద్యులను ఇతర ప్రాంతాల అవసరాలకు వాడాల్సిందిపోయి.. అరకొరగా ఉన్న గోలేటి డిస్పెన్సరీలో వైద్య సేవలను దారి మళ్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రభావం గిరిజనులపై తీవ్రంగా పడింది.. మెడికల్ క్యాంపులకు నర్సులు, వార్డు బాయ్ లు మాత్రమే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నారు. వైద్యులు లేకుండా అక్కడ ఎలాంటి వైద్య సేవలు అందుతాయో ఊహించవచ్చు. ఈ విషయం అధికారులకు తెలియందికాదు. ఉద్దేశ పూర్వకంగానే అధికారులు గోలేటి డిస్పెన్సరీ సేవలను నియంత్రిసున్నారు. 

మొక్కుబడిగా వైద్య సేవలు..

సింగరేణి యాజమాన్యం మాటతప్పిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. పూర్తి వైద్యుల పర్యవేక్షణలో అందాల్సినా వైద్యం మొక్కుబడిగా అందుతుంది. గిరిజనుల ఆరోగ్యం పట్ల అధికారులు ఉద్దేశపూర్వకంగానే అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ పరిస్థితి ఏదో ఒక రోజు కాదూ. నిత్యం దర్శనమిస్తుంది. దీంతో గిరిజనులు సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి వైద్య పరీక్షలు లేకుండానే వైద్య సిబ్బంది రోజూ వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా సింగరేణి అధికారులు మొక్కుబడి సేవలతోనే సరిపుచ్చుకుంటున్నారు. 

గోలేటి డిస్పెన్సరీలో సేవలు మందగింపు..

గోలేటి డిస్పెన్సరీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాంత సింగరేణి కార్మికులు, గిరిజన గ్రామాలకు వైద్య సేవలు అందించడంమే. కానీ నేడు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరిన్ని వైద్యసేవలను మెరుగు పరచడం కోసం ఇప్పుడున్న వైద్యులకు తోడు అదనంగా వైద్యులను కేటాయించాలి. కానీ ఉన్న వైద్యాధికారుల సేవలనే అందకుండా చేయడం ఎంతవరకు కరెక్టు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కార్మికులతో పాటు గిరిజనులకు వైద్య సేవలు అందించే బాధ్యత అధికారులపై ఉంది. ఈ విషయాన్ని యాజమాన్యం విస్మరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోలేటి డిస్పెన్సరీలో పనిచేస్తున్న వైద్యలు, సిబ్బందిని తరచుగా విధుల బదలాయింపుల పేరిట వేధిస్తున్నారని వాపోతున్నారు. అధికారుల వైఖరి వల్ల అటు ప్రజలు వైద్య సేవలకు నోచుకోవడంలేదు. ఇటు వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై కార్మిక సంఘాలేమి మాట్లాడక పోవడం తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. గిరిజనుల జీవితాల పునాదులపై ఓపెన్ కాస్ట్ లు నెలకొల్పి గిరిజనుల బ్రతుకులను ఆగమం చేశారు.. కనీసం వైద్య సేవలన్నా వారికి సంపూర్ణంగా అందిస్తారంటే అదీకూడా లేదు. సేవలు నామమాత్రం చేశారు.

మరికొద్ది రోజుల్లో గిరిజనులకు ఇప్పుడందిస్తున్న ఈ మాత్రం మందులు, గోలీలు అందించే సేవలు ఎంతకాలం ఉంటాయో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇప్పటికైనా కార్మిక సంఘాలు నిద్రమత్తు నుంచి మేల్కొవాలి. గిరిజనులకు పూర్తి వైద్య సేవలు పునరుద్ధరించాలి. గోలేటీ డిస్పెన్సరీ వైద్య సామర్థ్యాన్ని మరింతగా పెంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.