21-01-2026 12:00:00 AM
డీసీసీ వైఫల్యం.. చెల్లాచెదురవుతున్న కేడర్!
చేవెళ్ల నుంచి శేరిలింగంపల్లి దాకా నేతల మధ్య పంచాయితీ
మహేశ్వరం, రాజేంద్రనగర్లో ఎవరికి వారే..!
పట్టించుకోని జిల్లా నాయకత్వం..
మున్సిపల్ ఎన్నికల వేళ కార్యకర్తల్లో ఆందోళన
రంగారెడ్డి, జనవరి 20(విజయక్రాంతి): కీలకమైన మున్సిపల్‌ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్‌పార్టీలో నేతల మధ్య కోల్డ్‌వార్‌నడుస్తోంది. లీడర మధ్య ఎవరికివారే యుమున తీరే అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కేడర్‌నారాజ్‌అవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి గూడు పుఠాణిని తలపిస్తోంది. జిల్లా నాయకత్వం బలహీనంగా ఉండటంతో నియోజకవర్గాల్లో సీనియర్ నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్నది.
ముఖ్యంగా చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి కీలక నియోజకవర్గాల్లో వర్గవిభేదాలు పార్టీని నిలువునా చీలుస్తున్నాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లా కు చెందిన 8 మున్సిపాలిటీలు, మూడు కార్పోరేషన్ల ను జీహెచ్‌ఎంసీలో వీలినం చేయడం పార్టీ ముఖ్య నేతల మద్య భేదాభిప్రాయం చోటు చేసుకొంటోంది. ప్రధానంగా బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పోరేషన్,బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలు, పెద్ద అంబర్‌పేట్,అదిభట్ల, తుక్కుగూడ తుర్కయంజాల్‌మున్సిపాలిటీలను ప్రజాభిష్టం కు వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీలో వీలినం చేయడంతో కాకుండా సర్కిల్ ఏర్పాటు పై నేతలో కొంత అసంతృప్తి నెలకొంది.
ప్రతిపక్ష నేతలు రంగారెడ్డి జిల్లా ఉనికినే లేకుండా ప్రభుత్వం చేస్తుందంటూ ఇటీవల శంషాబాద్‌లో పెద్ద ఎత్తునా నిరసన కార్యక్రమాలు చేసిన అధికార పార్టీ నుంచి ప్రభుత్వం కు మద్దతుగా పార్టీ నేతలు స్పందించిన దాఖలాలు లేవు. ఇలా ప్రతీ అంశం పై జిల్లా పార్టీ నాయకత్వంలో బలహీనంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గత రెండేళ్ల నుంచి పార్టీ అధికారంలోకి వచ్చిన నామినేటెడ్, పార్టీ పదవులు దక్కుతాయనే ఎంతో ఆశతో ఉన్న స్థానిక నేతలకు పార్టీ తీసుకొంటున్న చర్యలు మింగుడుపడటం లేదనే విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు డీసీసీలను నియమించినా పార్టీ ఆదిష్టానం రంగారెడ్డి జిల్లా కు మాత్రం డీసీసీ ని నియమించలేదు... దీనికి ప్రధాన కారణంగా జిల్లాలో పార్టీ నేతల మధ్య గ్రుప్ తగదాలే అనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
నియోజకవర్గాల్లో ‘గ్రూపుల’ కుంపటి
జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేవెళ్ల నియోజకవర్గం లో బీఆర్‌ఎస్ పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఇక్కడ పాత, కొత్త నేతలు ఎమ్మెల్యే కాలే యాదయ్య, నియోజకవర్గ ఇన్చార్జి భీమ్ భరత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ఒకరు వెళ్లే కార్యక్రమానికి మరొకరు వెళ్లకపోవడం, కార్యక్రమాల్లో పోటాపోటీ ఫ్లెక్సీలతో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. మూడు రోజుల క్రితం మొయినాబాద్ లో భీమ్ భరత్ మాట్లాడుతూ త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేవెళ్ల,మొయినాబాద్, శంకర్పల్లి లో పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థులకు తానే బీఫామ్ ఇస్తానంటూ ప్రకటించారు. దీంతో నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్యే కాలే యాదయ్య మధ్య దూరాన్ని మరింత పెంచినట్లయ్యింది.
ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్చార్జిల మధ్య కోల్ వార్ మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉంది. మహేశ్వరం నియోజకవర్గంలో ఇక్కడ గ్రూపు రాజకీయాలు ముదిరి పాకాన పడ్డాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఏ గ్రూపులో ఉండాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇది పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి గట్టి దెబ్బ కొట్టింది.
ఇటీవలనే నియోజకవర్గ ఇన్చార్జ్ కేఎల్‌ఆర్, నేదునూరు గ్రామంలో పార్టీ నేతలపై తీరుపై గుర్రుగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలో పార్టీ నేతల మధ్య జరిగిన ఓ ఘటనపై సీరియస్ గా స్పందించి ఇద్దరు నేతలను పాటి నుంచి సస్పెండ్ చేయాలని పిసిసికి లేఖ రాశారు. దీంతో మహేశ్వరం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాల్లో బట్టబయల య్యాయి.
రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జి గా కస్తూరి నరేందర్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి గా జగదేశ్వర్ గౌడ్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయా నియోజకవర్గం లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్ ను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అప్పటినుంచి ఆయా నియోజకవర్గంలో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు, ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న పాత నేతల మధ్య ‘ఆధిపత్యపోరు’ సాగుతోంది. స్థానిక సమస్యలపై పోరాడటం కంటే ఒకరిని ఒకరు తొక్కేయడానికే నేతలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
చల్లా ‘సైలెంట్’.. కేడర్ ‘వైలెంట్’
డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న చల్లా నర్సింహారెడ్డి ప్రభుత్వం కట్టబెట్టిన టీయూఎఫ్ ఐడీసీ చైర్మన్ పదవితో బిజీగా ఉండటంతో, జిల్లాలోని ఈ గ్రూపు రాజకీయాలను చక్కదిద్దే తీరిక ఆయనకు లేకుండా పోయింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చల్లా ఆ రెళ్ల నుంచి ఆయనే అధ్యక్షుడిగా ఉండటం, కొత్త వారికి అవకాశం రాకపోవడంతో ఆశావహులు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కూడా లేకపోవడంతో, సమస్యలు చెప్పుకోవడానికి కార్యకర్తలకు దిక్కులేకుండా పోయింది.
‘మున్సిపాలిటీ’లో భయం
నేతల మధ్య ఉన్న ఈ ‘ఈగో’ల వల్ల ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఓటమి పాలుకావాల్సి వచ్చింది. జిల్లా లో 525 పంచాయతీ సర్పంచ్ లకు ఎన్నికలు జరుగగా అధికార, ప్రతి ప్రతిపక్ష పార్టీలు నువ్వా... నేనా అనే రీతిలో పోటీ ఇచ్చి అధికార పార్టీకి ధీటుగా పంచాయతీ స్థానాలను గెలుపొందాయి. ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బీఆర్‌ఎస్ హవా సాగడం పార్టీ పెద్దలను ఉలిక్కిపడేలా చేసింది. రాబోయే మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటికైనా ఈ గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
దిద్దుబాటు చర్యలెప్పుడు?
రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కోటాను కాపాడుకోవాలంటే తక్షణమే డీసీసీని పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ పెరుగుతోంది. చురుకైన నాయకుడిని నియమించి, చేవెళ్ల నుంచి శేరిలింగంపల్లి వరకు ఉన్న అంతర్గత విభేదాలను తొలగిస్తేనే పార్టీకి పూర్వవైభవం వస్తుందని క్యాడర్ అభిప్రాయపడుతోంది.