calender_icon.png 21 January, 2026 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

21-01-2026 12:00:00 AM

గంధమల్ల ప్రాజెక్ట్‌తో లక్ష ఎకరాలకు సాగునీరు 

ఆలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఆలేరు, జనవరి 20 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక అభివృద్ధిలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణంలోని  స్థానిక మైనారిటీ ఫంక్షన్ హాల్ లో, యాదగిరిగుట్టలోని  శ్రీ లక్ష్మి నరసింహా ఫంక్షన్ హల్ లో ఇందిర మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో భాగంగా మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు, ఇందిరమ్మ చీరలను ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యలతో కలిసి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం అనేక  సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశ పెట్టడంతో రాష్ట్రంలో 265 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారన్నారు. అందుకు గాను ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ పూర్తి అయితే పరిసర ప్రాంతాలకు, రైతులకు  లక్ష ఎకరాలకు  సాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు., అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశామని, మహిళా శక్తి  సంబరాల్లో బాగంగా  375 మహిళా సంఘాలకు రూ.78,87,160లు వడ్డీ లేని రుణాల చెక్కును స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేశామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరములో వివిధ బ్యాంకులు, స్త్రీ నిధి వారి సహకారముతో 179 సంఘాలకు రూ.15,29,00,000లు బ్యాంకు లింకేజీ చెక్కును స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేశారు. 

తదుపరి ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజాపాలన ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని, అందులో భాగంగానే వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు.ప్రతి ఆడ బిడ్డకు పుట్టింటి సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  త్వరలో ఇళ్లు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ముందుగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకునీ మండలంలోని సైదాపురం గ్రామంలో  అంగన్ వాడి భవనాన్ని ప్రారంభించారు, 33/11 కె. వి. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలో 33/11 కె. వి. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, జనగాం ఉపేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మెప్మా, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.