18 March, 2026 | 3:47 AM

హ్యామ్ రోడ్ల పేరిట 18 వేల కోట్ల స్కాం

18-03-2026 02:08 AM
  1. కమీషన్ల రూపంలో వేల కోట్లు దండుకునేందుకు ప్లాన్

టెండర్లు రద్దుచేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

మా ప్రభుత్వం రాగానే అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు 

పద్దులు చర్చకు వచ్చినప్పుడు మరిన్ని ఆధారాలు బయటపెడతాం 

బీఆర్‌ఎస్ సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో హ్యామ్ రోడ్ల పేరిట రూ.18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్‌ఎస్ సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు. ఆర్‌అండ్‌బీ శాఖలో రూ.12 వేల కోట్లు, పంచాయతీరాజ్ శాఖలో రూ.6 వేల కోట్ల కుంభకోణమని వివరించారు. మంగళవారం అసెంబ్లీలో హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టారని, రూ.1,800 కోట్లు నేరుగా వస్తాయని, నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఆ మొత్తాన్ని పంపుతారని చెప్పారు. చాలా పనుల బిల్లులు ఇవ్వడం లేదని, రోడ్లకు గుంతలు పడినా మరమ్మతులు చేయడం లేదని, కమీషన్ల కోసం హ్యామ్ రోడ్ల పేరిట వేల కోట్లు దండుకునేందుకు ప్లాన్ చేశారని మండిపడ్డారు. దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయని, కానీ ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయని తెలిపారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేసిందని గుర్తుచేశారు. మొత్తం 34లో ఇప్పటివరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారని, ముందే రింగ్ అయ్యారని ఆరోపించారు. కుమ్మక్కై ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పంచాయతీరాజ్‌లోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేశారని, ఇప్పటివరకు టెండర్ ధరలో ఐదు శాతం మాత్రమే ఎక్కువకు వెళ్లేలా సీలింగ్ ఉండేదని, ఇప్పుడు హ్యామ్ రోడ్లకు సీలింగ్ ఎత్తివేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకోవచ్చని, హ్యామ్ రోడ్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. నల్లగొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి, ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారని, టెండర్లలో సివేట్, సరళ, బృందా, బీవీఎస్‌ఆర్ కంపెనీలు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.

టెండర్లలో అవినీతి జరిగిందని, టెండర్లు రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పేర్కొన్నారు. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు, రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే టెండర్లలో పాలు పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ పద్దులు చర్చకు వచ్చినప్పుడు బీఆర్‌ఎస్ తరఫున మరిన్ని ఆధారాలు బయటపెడతామని, హైకోర్టు విచారణకు పట్టుబడతామని స్పష్టంచేశారు.