11 April, 2026 | 10:10 AM

మతిస్థిమితం లేని వ్యక్తి అంబులెన్స్ చోరీ!

08-12-2024 01:51 AM

రోడ్డుపై వేగంగా నడుపుతూ హల్‌చల్ 

టోల్‌గేట్లను ఢీకొట్టి పరారీకి యత్నం

సినీఫక్కీలో వెంబడించిన పోలీసులు

కేతేపల్లి వద్ద లారీలు అడ్డుపెట్టి పట్టివేత 

నల్లగొండ, డిసెంబర్ 7 (విజయక్రాంతి): నగరంలో అంబులెన్స్ (108 వాహనం)ను అపహరించిన మతిస్థిమితం లేని వ్యక్తి జాతీ య రహదారి హల్‌చల్ చేశాడు. వేగంగా వెళ్తూ అడ్డొచ్చిన టోల్‌గేట్లను ఢీకొట్టి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. సిన్కీఫక్కీలో అంబులెన్స్‌ను వెంబడించిన పోలీ సులు అతడిని నల్లగొండ జిల్లా సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సం బంధించిన వివరాలిలా.. సరూర్‌నగర్‌కు చెందిన అంబులెన్స్‌లో హయత్‌నగర్‌లోని సన్‌రైస్ దవాఖానకు శనివారం ఉదయం వృద్ధురాలిని తీసుకొచ్చారు.

పైలెట్ తాళం వాహనానికే ఉంచి రోగిని ఐసీయూకు తీసుకెళ్లేందుకు లోపలికి వెళ్లాడు. దవాఖాన ఎదు టే ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తి (కాలభైరవుడు)వాహనాన్ని స్టార్ట్ చేసి సైరన్ వేసుకొని విజయవాడ వైపు పరారయ్యాడు. 108 సిబ్బంది మరో వాహనంలో పట్టుకునేందు కు యత్నించినా వీలుపడకపోవడంతో 100 కు సమాచారమివ్వగా రంగంలోకి దిగారు. అయితే నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద అంబులెన్స్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ ఏఎస్సై జాన్‌రెడ్డిని, కేతేపల్లి మం డలం కొర్లపహాడ్ వద్ద టోల్‌ప్లాజా గేట్లను ఢీకొడుతూ వెళ్లిపోయాడు.

దీంతో టేకుమట్ల వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డుగా లారీలు పెట్టడంతో రహదారి కిందకు అంబులెన్స్‌ను దింపాడు. కేతేపల్లి ఎస్సై శివతేజ సిబ్బందితో కలిసి కాలభైరవుడిని అదుపులోకి తీసుకొని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించినట్టు తెలిసింది. ఘటనపై సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టారు. అంబులెన్స్ ఢీకొని తీవ్రంగా గాయపడిన ఏఎస్సై జాన్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు.

కొంతకాలంగా మతిస్థి మితం లేకుండా హయత్‌నగర్ బస్టాండ్ పరిసరాల్లో తిరుగుతున్న వ్యక్తి అంబులెన్స్‌ను చోరీ చేయడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అయితే సదరు వ్యక్తి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న పోలీసు వాహనాల్లో గాలి తీసేసి అంబులెన్స్‌తో పరార వడం కొసమెరుపు.