11 April, 2026 | 8:19 AM

నా చావుకు బీఆర్‌ఎస్ నేతలే కారణం

08-12-2024 01:51 AM
  1. * సెల్ఫీ వీడియో తీసుకొని వ్యక్తి సూసైడ్
  2. ఆస్తి తగాదాల్లో బెదిరిస్తున్నారని ఆవేదన

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7(విజయక్రాంతి): ఆస్తి తగాదా విషయంలో సెటిల్‌మెంట్ అనంతరం డబ్బుల విషయంలో బీఆర్‌ఎస్ నేతలు తనపై ఒత్తిడి చేస్తున్నారని సూసైడ్ లెటర్ రాసి, సెల్ఫీ వీడియో తీసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బోరబండ డివిజన్ సాయిబాబానగర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్(48) ఓ హోటల్ పనిచేసేవాడు.

అతని భార్యకు వారసత్వంగా వచ్చిన బాబా షైలానీనగర్‌లోని నోటరీ స్థలం కొన్నేళ్లుగా కుటుంబసభ్యుల మధ్య వివాదంలో ఉంది. ఎమ్మెల్యే అనుచరులుగా చలామని అవుతున్న బీఆర్‌ఎస్ నాయకులు.. ప్రశాంత్, సాయిచరణ్, రాజు మధ్యవర్తులుగా శ్రీనివాస్‌ను కలిసి వారి ఆస్తి వివాదాన్ని పరిష్కరిస్తామని నమ్మించడంతో అతను అంగీకరించాడు. ఆస్తి వివాదం ఓ కొలిక్కి రావడంతో ఆ స్థలాన్ని అమ్మి డబ్బులు ఇస్తామని శ్రీనివాస్‌గౌడ్‌ను వారు నమ్మించారు. ఆస్తివిలువ పెరిగినందున దాన్ని బయటి వ్యక్తులకు ఎందుకు అమ్మాలని, ఆ మొత్తం తామే ఉంచుకుంటామని శ్రీనివాస్.. మధ్యవర్తులకు చెప్పాడు. మధ్యవర్తులకు రూ.22.50లక్షలు చెల్లించేందుకు అంగీకరించాడు.

ముందుగా రూ.8లక్షలు చెల్లించగా.. మరో రూ.14.50లక్షలు చెల్లించేందుకు గడువు తీసుకుని అగ్రిమెంట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన చెక్కులను మధ్యవర్తులకు ఇచ్చాడు. అయితే స్థలం కాగితాలను మాత్రం మధ్యవర్తులు తమవద్దే ఉంచుకున్నారు. అయితే గడువు ముగియడంతో.. చెక్‌బౌన్స్ కేసు పెడతామని బెదిరిస్తూ కొన్నినెలలుగా శ్రీనివాస్‌ను మధ్యవర్తులు తీవ్ర ఒత్తిడికి గురిచేశారు.

తనకు అనుకున్న సమయానికి డబ్బులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పాలుపోక.. తాను చనిపోతున్నానంటూ నగర పోలీస్ కమిషనర్, సీఎం రేవంత్‌రెడ్డి నా కుటుంబానికి న్యాయయం చేయాలి అని చెప్పి సెల్ఫీ వీడియోద్వారా తెలియజేస్తూ శనివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన ప్రశాంత్, డీ.రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సాయిచరణ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్ సీఎన్‌రెడ్డి బోరబండ సీఐ వీరశేఖర్‌కు ఫిర్యాదు చేశారు.