calender_icon.png 21 January, 2026 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంలో మండ మెలిగే పండుగ

21-01-2026 01:51:28 AM

మహా జాతరకు ఆరంభ సంకేతం

నేడు సంప్రదాయబద్దంగా నిర్వహణ

మేడారం, జనవరి 20 (విజయక్రాంతి): మేడారం మహా జాతరకు ఆరంభ సంకేతమైన ‘మండమెలిగే’ పండుగను సమ్మక్క, సారలమ్మ , పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుండే మేడారం, కన్నేపల్లి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో బుధవారం ఆదివాసి గిరిజనులు సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఈనెల 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ మహా జాతర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ సాంస్కృతిక పండుగగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ మహా జాతర ప్రారంభానికి సంకేతంగా నిర్వహించే ’మండమెలిగే పం డుగ’ ఆదివాసీ సమాజంలో సాంప్రదాయిక విలువలను ప్రతిబింబిస్తుంది.

ఈ పండుగ గ్రామాన్ని పవిత్ర జాతరకు సిద్ధపరచడమే కాకుండా, వన దేవతలైన సమ్మక్క సారలమ్మలను ఆహ్వానించే పవిత్రమైన ఆచారంగా శతాబ్దాలుగా కొనసాగుతోంది. మహా జాతరకు సరిగ్గా ఒక వారం ముం దు నిర్వహించే ఈ ఉత్సవం, గ్రామాన్ని పవిత్రత్వంతో నిం పి, దేవతల ఆగమనానికి మార్గం సుగమం చేస్తుంది. ఆదివాసీలు ఈ పండుగను జాతర ఆరంభానికి అధికారిక సంకేతంగా భావిస్తారు. ఇది కేవలం ఆచారమే కాకుండా, సమాజంలో ఐక్యత, భక్తి, ప్రకృతి సమతుల్యతను ప్రోత్సహించే పవిత్ర కార్యక్రమంగా భావిస్తారు.

ఉదయాన్నే ఆలయ పూజారులు దేవాలయాలను శుద్ధి చేస్తారు. పసుపు, కుంకుమలతో అందమైన ముగ్గులు వేసి, డోలు సంగీతం మధ్య గ్రామవాసులు ఉత్సాహంగా పాల్గొంటారు. అడవి నుండి కలప, కొమ్మలు, గడ్డి తెచ్చి కొత్త గుడిసలు నిర్మిస్తారు. వనదేవతల జాతరకు వస్తువులను శుద్ధి చేస్తారు. ఇది ’మండమెలిగే’ అనే పేరుకు సార్థకతనిస్తుంది. అష్టదిక్కుల్లో దిష్టి తోరణాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేస్తారు. ఈ పండుగ ద్వారా ప్రకృతి, భక్తి, సాంప్రదాయాల మధ్య సమన్వయాన్ని గుర్తుచేస్తూ, తరతరాలుగా కొనసాగుతున్న ఆదివాసీ వారసత్వాన్ని పరిరక్షిస్తుంది.