21-01-2026 01:49:43 AM
‘ఇండియా పెవిలియన్’ ప్రారంభోత్సంలో మంత్రి శ్రీధర్‌బాబు
దిగ్గజ పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపు
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి) : ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ’ లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిన తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు.
మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా దావోస్ లో ఏర్పాటు చేసిన ‘ఇండియా పెవిలియన్’ ప్రారంభోత్సవంలో తెలంగాణ తరఫున మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని మాట్లాడారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10శాతానికి చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేశామని తెలిపారు.
పెట్టుబడుల అనుకూలతలపై వివరణ
ఈ విజన్ డాక్యుమెంట్‌లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, హెల్త్ కేర్ ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, హార్డ్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీ, ఐటీఈఎస్, ఏరో స్పేస్, డిఫెన్స్, టెకస్ట్ టైల్, అప్పారెల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలు, అవకాశాలు, ఎకో సిస్టం గురించి మంత్రి వివరించారు.
దావోస్ వేదికగా తమ ప్రభుత్వం గత రెండేళ్లలో సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించిందన్నారు. ‘తెలంగాణ బ్రాండ్’ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా లైఫ్ సైన్సెస్ పాలసీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(టీఏఐహెచ్) ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిష్కరిస్తామని చెప్పారు.