డంప్‌యార్డులో అగ్నిప్రమాదం
తగలబడుతున్న చెత్తకుప్పలు
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
గజ్వేల్, మే 25 : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ డంప్‌యార్డులో శనివారం మంటలు చెలరేగాయి. భారీస్థాయిలో చెత్తకుప్పలు తగలబడడంతో గజ్వేల్ శివారుల్లో పొగ కమ్ముకుంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ నర్సయ్య అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించి డంప్‌యార్డుకు తరలించడం, ప్రతి ఏడాది ఇలాగే అగ్నిప్రమాదం సంభవించడం జరుగుతుండడం ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తుంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెత్తను తగలబెట్టకుండా రీసైక్లింగ్ చేయాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తుంది. కానీ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని డంప్‌యార్డులో ప్రతి ఏడాది భారీస్థాయిలో అగ్నిప్రమాదం సంభవించి చెత్త తగలబడడం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తుంది. అగ్నిప్రమాదం ఎలా సంభవించిందో కూడా అధికారులు తెలుసుకునే ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం.






