5 May, 2026 | 2:03 AM

రైతులు చచ్చేదాక వదిలిపెట్టని ప్రభుత్వం

05-05-2026 12:34 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రం సందర్శన

రైతుల ఇబ్బందులపై తీవ్ర విమర్శలు 

వారం రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తాం

సదాశివపేట, మే 4: రాష్ట్రంలో రైతులు చచ్చేదాక కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్నికేటీఆర్ సోమవారం సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు శనగలు వేసి నెలరోజులు గడిచినా ఇప్పటివరకు ఒక్క పైసా కూడా అందలేదని, కేంద్రంలో సరిపడా సంచులు కూడా లేవని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కేటీఆర్ మాట్లా డుతూ గత బీఆర్‌ఎస్  ప్రభుత్వ కాలంలో మొక్కజొన్న కొనుగోలుకు 750 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం కేవలం 80 కేంద్రాలకే పరిమితమైందని విమర్శించారు.

45 డిగ్రీల ఎండలో రైతులు వడ దెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం రైతులను దళారుల చేతుల్లోకి నెట్టేస్తోందని ఆయన ఆరోపించారు. కొనుగోలు కేంద్రంలో వర్షం పడితే ధాన్యాన్ని కాపాడేందుకు కనీస సదుపాయాలు కూడా లేవని, రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉండగా.. కేవలం  9 లక్షల మెట్రిక్ టన్నుల ధన్యమే కొనుగోలు చేశారని, ధాన్యం దళారుల పాలు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు.

సివిల్ సప్లై కార్పోరేషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని, అందుకే ఈ ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయన్నారు. సీఎం, మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారా..? అని ప్రశ్నించారు. సీఎంకి భూముల కొనుగోళ్లు, రియల్  ఎస్టేట్ పై ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ రాసిన లేఖతో రైతులపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు.

రాబోయే వారం రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలు తిరిగి రైతులకు ధైర్యం చెబుతామని, అవసరం అయితే తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. రైతుల నుంచి ఎలాంటి కండిషన్లు లేకుండా ప్రభుత్వం కనీస మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని, లేదంటే రాబోయే వారం రోజుల్లో ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, పాడి కౌశిక్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, నాయకులు బిక్షపతి, శివరాజ్పాటిల్ పాల్గొన్నారు.