100 మీటర్ల పైప్‌లైన్‌కు..వంద బొక్కలు..!
ప్యాచ్లతోనే కాలం కొత్త పైప్‌లైన్‌కు మోక్షం ఎప్పుడో..
ఎల్లారెడ్డి, ఆగస్ట్ 5 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో కేవలం 100 మీటర్ల కొత్త వాటర్ పైప్లైన్ వేస్తే తీరిపోయే సమస్య ఏళ్లుగా ప్రజలను వేధిస్తోంది. రోడ్డుపై పైపైన ఏర్పాటు చేసిన పైప్లైన్ను, ఇసుక ట్రాక్టర్లు, హెవీ లోడ్ వాహనాలు తరచూ తిరుగుతుండడంతో పైప్ లైన్ పగిలిపోతుంది. వారానికి ఒకసారి గుంత తవ్వి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పైప్లైన్ లీకేజీ కావడంతో తాజాగా మరోసారి మరమ్మతులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు దాదాపుగా ఆ 100 మీటర్ల పైప్లైన్కు వందకు పైగా బొక్కలు పడి అడుగడుగునా ప్యాచ్లు వేసినట్లు స్థానికులు తెలిపారు. గత కమిషనర్తో పాటు ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో నిర్వహించిన వార్డు సభలో కూడా సమస్యను స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.
అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్యాచ్ వర్కులతో కాలం వెళ్లదీయకుండా, రోడ్డుకు తగిన లోతులో కొత్త 100 మీటర్ల త్రాగునీటి పైప్లైన్ను ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 100 మీటర్ల పైప్ లైన్ కు 100 బొక్కలు ఏర్పడ్డాయని వాటి మరమ్మత్తులకే నిధులు ఖర్చవుతున్న శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. కొత్త పైప్ లైన్ వంద మీటర్ల వరకు వేస్తే ఏలాంటి ప్యాచ్ వర్క్ లు చేయాల్సిన పనిలేదని గ్రామస్తులు తెలిపారు.






