తల్లి ఆశీర్వాదమే బిడ్డకు శాపమై..
ప్రస్తుతం తాప్సి కథానాయికగా రూపొందుతున్న చిత్రం ‘గాంధారి’. ఈ సినిమాలో ప్రతీకారం తీర్చుకునే తల్లిగా ఒక శక్తివంతమైన పాత్రలో తాప్సి నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. దేవాశిశ్ మఖిజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కనికా థిల్లాన్ నిర్మిస్తున్నారు. ‘తల్లి ఆశీర్వాదం బిడ్డను ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుందంటారు. కానీ నా బిడ్డ విషయంలో అది శాపంగా మారింది’ అని చిత్రంలో తాప్సి చెబుతుంది.
తల్లి ఆశీర్వాదం బిడ్డకు శాపంగా మారడమనేదే చాలా ఆసక్తికరమైన అంశం. అదెలా జరిగిందనేది సినిమా చూస్తేనే తెలియనుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియా వేదికగా తాప్సి పంచుకుంది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ మొదలైనట్టు తెలిపింది. చిత్రీకరణ ఫోటోలతో “టైం వచ్చినప్పుడు నేను యుద్ధ రంగంలో వీరోచితంగా పోరాడుతూ మరణించాలి కానీ శత్రువుల ముందు భయం వీడాలి. ఇప్పుడు పోరాటం మొదలుపెడతాం” అని తాప్సి పోస్టులో పేర్కొన్నారు.






