calender_icon.png 22 January, 2026 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాస్తుల కొండ

22-01-2026 02:36:02 AM

హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డిపై కేసు

హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో 8 చోట్ల ఏసీబీ దాడులు 

7.69 కోట్ల విలువైన స్థిర, చరాస్తుల గుర్తింపు

మార్కెట్‌లో వాటి విలువ వందల కోట్లు!

ఎల్బీనగర్/మిర్యాలగూడ, జనవరి 21 (విజయక్రాంతి): హనుమకొండ అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఇన్‌చార్జి అధికారి వెంకట్‌రెడ్డి అక్రమాస్తుల బాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు. గతేడాది డిసెంబర్ 4న లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. సరూర్‌నగర్‌లోని ఆయన నివాసంతో పాటు నల్లగొండ, మిర్యాలగూడతోపాట మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మిర్యాలగూడ సాయి రెసిడెన్సీలో నివా సం ఉంటున్న సమీప బంధువైన మధుసూదన్‌రెడ్డి ఇంటితో పాటు దొండవారి గూడెం గ్రామంలోని బంధువుల ఇండ్ల లో సోదాలు చేశారు.

అదేవిధంగా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామం లో ఆయనకు, సమీప బంధువు బినామిగా పొలాలు ఉన్నాయని తెలుసుకొని గ్రామ ప్రజలను భూమి వివరాలను అడి గి తెలుసుకున్నారు. ఈ సోదాల్లో సుమా రు రూ. 7.69 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో వందల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అధికారులు గుర్తించిన అక్రమ ఆస్తుల్లో హైద రాబాద్ ఇతర ప్రాంతాల్లో రెండు నివాస గృహాలు ఉన్నాయి. వాటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 4.65 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. మంచిరేవులలో రూ. ౫ కోట్ల విలువ చేసే విల్లా, భువనగిరిలో ఫామ్‌హౌస్‌ను గుర్తించారు.

ఒక కమర్షియల్ షాపు (రూ.60 లక్షలు), ఎనిమిది ఓపెన్ ప్లాట్లు (రూ.65 లక్షలు), 14.25 ఎకరాల వ్యవసాయ భూమి(రూ.50 లక్షలు), నగదు రూ. 30 లక్షలు, బ్యాంక్ సేవింగ్స్ మరో రూ. 44 లక్షలు, రూ. 40 లక్షలు విలువజేసే మూడు కార్లు, 297 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 11 లక్షల గృహోపకణాలను గుర్తించారు. గతంలో ఒక ప్రైవేట్ పాఠశాల లైసెన్స్ రెన్యువల్ కోసం రూ. 60 వేల లంచం డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా వెంకట్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు.

ఆ కేసు విచారణలో భాగంగా ఆయన అక్రమ సంపాదనపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు, ఈ భారీ అక్రమాస్తులను గుర్తించి కేసు నమోదు చేశారు. కాగా నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని మార్కపూర్‌కి చెందిన వెంకట్‌రెడ్డి గతంలో దామరచర్ల మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న సమయంలోనూ అవినీతి అక్రమాలపై సస్పెండ్ అయ్యారు.