22-01-2026 02:51:47 AM
పూటకో లొల్లి.. రోజుకో పంచాయితీ
మంత్రులు తలోదారి!
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ కల హాల కాపురంగా మారింది. మంత్రుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కుతోంది. కొందరు మంత్రుల్లో ఒకరికంటే ఒకరిపై నమ్మకం లేకుండా పోయింది. అంతే కాకుండా ఒకరిపై మరొకరు ఆధిపత్య ధోర ణి ప్రదర్శిస్తున్న పరిస్థితి తెలంగాణ మంత్రివర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మం త్రిపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా.. దాన్ని మరో మంత్రి కావాలనే చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో మంత్రుల మధ్య సఖ్యత లేదనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తన క్యాబినెట్‌లోని మంత్రులపై పట్టులేదనే విమర్శలకు అధికార కాం గ్రెస్ తావిస్తోంది. కొందరు మంత్రులు ఒకరి శాఖలో మరొకరు తలదూర్చడం, అంతర్గత పంచాయితీలు. .ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారు తున్నాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేపోతున్నాయి. అధికార పార్టీ లో పుటకో లొల్లి, రోజుకో పంచాయితీ అన్న చందంగా మారింది.
మేడారం పునురుద్ధరణకు సంబంధించి టెండర్ పనులు, మంత్రి కోమటిరెడ్డిపై ఓ మీడియాలో వచ్చిన కథనంతో పాటు సింగరేణి నైనీ బ్లాక్ టెండర్ పనుల వరకు మంత్రుల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే.. మంత్రుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ వివా దాలపై పార్టీ నాయకత్వం కలుగజేసుకుని.. ఇరువురి మధ్య వివాదాలు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినా.. జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మీడియాలో కోమటిరెడ్డిపై కథనాలు
ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐఏఎస్ అధికారుల విషయంలో ఓ టీవీ చానల్‌లో వచ్చిన కథనం.. ఒకరిద్దరు మంత్రుల మధ్య మరింత ఆజ్యం పోసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా క్యాబినెట్‌లోని ఒక సీనియర్ మంత్రి తెరవెనుక కుట్రలు చేశారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో మంత్రి కోమటిరెడ్డి కూడా తీవ్ర భావోద్వేగానికి గురైన పరిస్థితి నెలకొన్నది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని సిట్ వేయడం, ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చడం, ఆ తర్వాత విడుదల చేయడం జరిగిపోయింది.
ఈ వివాదం ఇలా ఉండగానే, సింగరేణి సంస్థకు చెందిన నైనీబ్లాక్ టెండర్ వివాదం తెరమీదికి రావడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నైనీ బ్లాక్ టెండర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై మీడియాలో వచ్చిన కథనానికి ముడిపెడుతూ, ఈ వివాదంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు తెరపైకి రావడం మరింత కలకలం రేగింది. నైని బొగ్గు వార్త వెనుక కాంగ్రెస్‌లోని ఒక ప్రముఖ నాయకుడే ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది.
ఈ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ రెండు మీడియా సంస్థల మధ్య నెలకొన్న పంచాయితీని మా మంత్రుల మధ్యకు తీసుకురా వొద్దని సున్నితంగా హెచ్చరించడంతో.. ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినా.. భవిష్యత్‌లో మాత్రం మళ్లీ తెరపైకి వస్తుందని పార్టీ నేతల్లో గుస గుసలు వినిపి స్తున్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో కేవలం మంత్రుల మధ్యనే వివాదాలు లేవని, క్షేత్ర స్థాయిలోనూ నాయకుల మధ్య పొసగడం లేదని చెబుతున్నారు.
పొంగులేటి X కొండా సురేఖ
మేడారం ఆలయ పునురుద్ధరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్ల వరకు మంజూరు చేసింది. ఈ టెండర్ పనుల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ మధ్య వివాదం నెలకొన్నది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న మేడారం ఆలయ పనుల విషయంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పెత్తనమేంటి..? అని మంత్రి కొండా సురేఖ నిలదీశారు. దీంతో వెంటనే టెండర్ పనుల జీవోను రోడ్డు, భవనాల శాఖ నుంచి మరోసారి జారీ చేయడం మంత్రుల మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేయడానికి వరంగల్ జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే.
వివేక్ X సురేఖ
ఇదిలా ఉంటే మరో మంత్రి వివేక్ అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం కూడా వివాదానికి దారితీసింది. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ వద్ద ఉన్నది. కొండా సురేఖకు తెలియకుండానే కార్మిక శాఖ మంత్రి వివేక్ సమీక్ష నిర్వహించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటితో పాటు డెక్కన్ సిమెంట్ కంపెనీ వ్యహారం హాట్ టాఫిక్‌గా మారింది. ఈ వివాదం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పార్టీ నాయకులు రోహిన్‌రెడ్డి చుట్టూ తిరిగింది. చివరకు కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ను తప్పించే వరకు వెళ్లింది. సుమంత్‌ను అరెస్టు చేసేందుకు మంత్రి కొండా సురేఖ నివాసానికి పోలీసులు వెళ్లగా, ఆమె కూతురు సుస్మిత పోలీసులను అడ్డుకోవడం, ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో పెద్ద దుమారాన్నే లేపాయి. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే వార్తలు కూడా వినిపించాయి. వెంటనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌లు రంగంలోకి దిగి మంత్రి సురేఖను వెంటబెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరకు వెళ్లి వివాదం సద్దుమణిగేలా చేశారు.
అడ్లూరి X పొన్నం
ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత (దున్నపోతు) వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో పెద్ద కలకలమే రేగింది. మంత్రి అడ్లూరి మద్దతుగా, పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్‌తో పాటు దళిత సంఘాలు కూడా ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఈ వివాదం పెద్దగా మారితే పార్టీకి జరగరాని నష్టం జరుగుతుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో క్షమాపణ చెప్పించి వివాదానికి తెరదించే ప్రయత్నం చేసింది. అయితే, పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పక్కనే ఉన్న వివేక్ కూడా సమర్థించే ప్రయత్నం చేశారనే విమర్శలు కూడా వినిపించాయి. వీటితో పాటు మంత్రి వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావులు ఎప్పటికీ ఉప్పునిప్పుగానే ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది.