calender_icon.png 22 January, 2026 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ బొడ్రాయి.. ముచ్చర్ల సత్తన్న

22-01-2026 02:31:48 AM

  1. పదవుల కంటే ఆత్మగౌరవమే మిన్న అని చాటిన వైతాళికుడు 
  2. క్యాబినెట్ మంత్రిగా, ఉద్యమకారుడిగా చెరగని ముద్ర
  3. పాటనే ఆయుధంగా మలచిన ప్రజా వాగ్గేయకారుడు
  4. సత్తన్న జయంతి వేడుకల్లో పలువురు వక్తలు
  5. రవీంద్రభారతి వేదికగా సత్తన్నకు నివాళి

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 21 (విజయక్రాంతి):  అదురు బెదురు లేని గుండె.. అన్యాయాన్ని ప్రశ్నించే ధిక్కార స్వరం.. పదవి ఉన్నా లేకున్నా జనం కోసం, తెలంగాణ కోసం పరితపించిన మనసు.. వెరసి ముచ్చర్ల సత్తన్న. తెలంగాణ ఉద్యమ తొలితరం వాగ్గేయకారుడు, ప్రజా నాయకుడు, మాజీ రవాణా శాఖ మంత్రి సంగంరెడ్డి ముచ్చర్ల సత్యనారాయణ 93వ జయంతి వేడుకలు బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా అత్యంత వైభవంగా జరిగాయి. ఆయన జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ధిక్కార దినోత్సవం పేరిట సంబరాలు నిర్వహించారు.

తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఉద్యమకారులు, అభిమానులు, కళాకారులతో రవీంద్రభారతి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా సాగిన ఈ ఉత్సవంలో.. సత్తన్న జీవితం, పోరాటం, ఆయన రాసిన పాటల ప్రవాహం కొనసాగింది. జై తెలంగాణ.. జై ముచ్చర్ల సత్తన్న అనే నినాదాలతో ఆడిటోరియం దద్దరిల్లింది.

సర్పంచ్ నుంచి క్యాబినెట్ మంత్రి వరకు..

వరంగల్ జిల్లా ప్రస్తుత హన్మకొండ హసన్పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో 1933 జనవరి 21న సామాన్య కుటుంబంలో జన్మించిన సత్యనారాయణ.. తన ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకుని ముచ్చర్ల సత్తన్నగా ఖ్యాతి గాంచారు. చిన్నతనంలోనే నాటకాలు, బుర్రకథలు, జానపద కళల్లో ఆరితేరిన ఆయన.. 1959లో పంచాయతీ రాజ్ వ్యవస్థ వచ్చిన కొత్తలో ముచ్చర్ల సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత సమితి అధ్యక్షుడిగా, హన్మకొండ పంచాయతీ ప్రెసిడెంట్‌గా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో టీడీపీ తరఫున హన్మకొండ ఎమ్మెల్యేగా 21,415 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది.. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనలోని ఉద్యమకారుడు ఎప్పుడూ నిద్రపోలేదని, అధికారం ఆయన వ్యక్తిత్వాన్ని ఏనాడూ మార్చలేకపోయిందని వక్తలు గుర్తుచేశారు.

తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర..

ముచ్చర్ల సత్తన్న జీవితమంతా తెలంగాణ పోరాటాల మయమేనని సభలో ప్రముఖులు కొనియాడారు. 1952లో జరిగిన ఇడ్లీ-సాంబార్ గో బ్యాక్, నాన్-ముల్కీ గో బ్యాక్ ఉద్యమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సహించలేక.. తక్కలపల్లి పురుషోత్తమ్ రావుతో కలిసి తెలంగాణ రక్షణ సమితిని స్థాపించి పోరాటబాట పట్టారు. ఖమ్మంలో రవీంద్రనాథ్ చేపట్టిన దీక్షలో పాల్గొని ప్రజలను ఉద్వేగపరిచారు. మలిదశ ఉద్యమంలోనూ 2001లో కేసీఆర్‌తో కలిసి టీఆర్‌ఎస్ నేటి బీఆర్‌ఎస్ వ్యవ స్థాపక సభ్యుడిగా కీలకపాత్ర పోషించారు.

పాటలే ఆయన ఆయుధాలు: ప్రొఫెసర్ జయధీర్

ప్రముఖ చరిత్రకారుడు, ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల మాట్లాడుతూ.. ముచ్చర్ల సత్తన్నను తె లంగాణ వైతాళికుడిగా అభివర్ణించారు. ఆయన రాసిన జానపద పాటలు కేవలం వినోదం కోసం కాదు. అవి పాలకుల గుండెల్లో గుబులు రేపిన ఆయుధాలు. తెలంగాణ యాసలో, ప్రజల పలుకుబడిలో ఆయన రాసిన పాటలు పల్లెపల్లెనా ఉద్యమ జ్వాలలు రగిలించాయి. జై తెలంగాణ పత్రిక ద్వారా అక్షరాయుధాలను కూడా సంధించిన ధీశాలి అని విశ్లేషించారు.

తండ్రి బాటలో నడుస్తా.. పృథ్వీరాజ్

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సత్తన్న కుమారుడు, తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా నాన్న గారు కేవలం నాకు తండ్రి మాత్రమే కాదు.. తెలంగాణ ఉద్యమానికి ఒక తండ్రి లాంటి వారు. ఆయన నేర్పిన ధిక్కారం, ఆయన వినిపించిన గొంతుక ఇప్పటికీ తెలంగాణ గుండెల్లో మండుతూనే ఉంది. ఆయన ఆశయ సాధన కోసమే నేను తెలంగాణ క్రాంతి దళ్ ద్వారా పని చేస్తున్నాను. భవిష్యత్ తరాలకు ఆయన పోరాట స్ఫూర్తిని అందించడమే నా లక్ష్యం’ అని పేర్కొన్నారు.