15 April, 2026 | 4:58 AM

ప్రజల మాటగా మారుతున్న పేరు

05-01-2026 12:00 AM
  1. 13వ వార్డులో దండు సారయ్య (సారిక) శివశక్తి పోటీ? 

ప్రజాసేవలో నిమగ్నం 

ఇల్లందు టౌన్, జనవరి 4 (విజయక్రాంతి): ఇల్లందు మున్సిపాలిటీ 13వ వార్డులో రాజకీయ వాతావరణం మెల్లగా మారుతోంది. పెద్ద శబ్దాలు లేకుండా, ప్రచార హంగులు లేకుండానే ఒక పేరు ప్రజల మధ్య చర్చకు వస్తోంది. అదే పేరు  దండు సారయ్య (సారిక) శివశక్తి. ఇది ఒక్క రోజు, ఒక్క కార్యక్రమంతో వచ్చిన పేరు కాదు. కాలక్రమంలో, కష్టాల్లో కనిపిస్తూ, అవసరంలో అండగా నిలుస్తూ ప్రజల నమ్మకాన్ని సంపాదించుకున్న పేరు.

ప్రచారం లేకుండానే ఏర్పడిన ప్రజాభిమానం..

సాధారణంగా ఎన్నికలు దగ్గరపడితే నాయకులు ప్రజల మధ్యకు వస్తారు. కానీ దండు సారయ్య మాత్రం ఎన్నికల ముందు కాదు  ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ వచ్చారు. పేదకుటుంబాల్లో కష్టం వచ్చినప్పుడు, వృద్ధులకు ఆసరా అవసరమైనప్పుడు, ఆకలితో ఉన్నవారికి అన్నం కావాల్సినప్పుడు ఆయన పేరు ముందుగా వినిపిస్తుంది. ఆర్‌ఆర్ కాలనీ పరిధిలో నిరుపేద కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించడం, మతభేదాలు లేకుండా రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లిం సోదరులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు పంపిణీ చేయడం ద్వారా ఆయన సేవా దృక్పథం ప్రజల్లో బలంగా పేరు పెట్టింది.

కరోనా కాలంలో పరీక్షకు నిలిచిన నమ్మకం..

కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా మంది వెనుకడుగు వేసిన వేళ, దండు సారయ్య మాత్రం ముందుకు వచ్చారు. వందల మందికి నిత్యావసర సరుకులు, కూరగాయలు పం పిణీ చేస్తూ ఆకలితో ఎవ్వరూ ఉండకూడదు అనే ఆలోచనను ఆచరణలో చూపించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచి భరోసా ఇచ్చారు. ఈ కాలంలోనే ఆయనపై ప్రజల్లో నిశ్శబ్దమైన విశ్వాసం మరింత బలపడిందని వార్డు వాసులు చెబుతున్నారు.

యువత, కళాకారులు, క్రీడాకారులకు అండగా..

దండు సారయ్య సేవా పరిధి కేవలం ఆపద సహాయానికే పరిమితం కాదు. యువతలో ఆత్మవిశ్వాసం పెంచేలా డాన్స్ పోటీలు, క్రికెట్, షటిల్ వంటి క్రీడా పోటీలను నిర్వహిస్తూ కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు, పేదలకు నూతన వస్త్రా లు, దుప్పట్లు పంపిణీ చేస్తూ అన్నదాతగా కూడా గుర్తింపు పొందుతున్నారు.

గత  మున్సిపల్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి పోటీ చేసిన దండు సారయ్య స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కానీ ఆ ఓటమిని రాజకీయ వైఫల్యంగా కా కుండా ప్రజల మధ్య ఉండే అవసరాన్ని మరింత అర్థం చేసుకునే అనుభవంగా తీసుకున్నారని ఆయనకు దగ్గర వర్గాలు చెబుతున్నాయి. ఈసారి దండు సారయ్య రావాలి అనే అభిప్రాయం పలువురు పెద్దలు, యువత, మహిళల్లో వినిపిస్తోంది. సారయ్య మాత్రం పార్టీ పేరు ప్రకటించలేదు. ప్రచారం ప్రారంభించలేదు. ప్రజల స్పందనను గమనిస్తూ, పరిస్థితులను అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీ కన్నా ప్రజలే కీలకం..

దండు సారయ్యకు దగ్గరగా ఉన్నవారు చెబుతున్న సమాచారం ప్రకారం, ఈసారి పార్టీ కన్నా ప్రజల అభిప్రాయానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. సేవే తన బలం, ప్రజల నమ్మకమే తన మూలధనం అన్న ఆలోచనతోనే ముందుకు సాగుతున్నట్టు సమాచారం.

13వ వార్డులో ‘ఫ్యాక్టర్’గా మారుతున్న పేరు..

ఈసారి ఎన్నికల్లో దండు సారయ్య బరిలోకి దిగితే, 13వ వార్డు రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గెలుపు ఓటమికి మించి, ఆయన నిర్ణయం మొత్తం వార్డు రాజకీయ దిశను ప్రభావితం చేసే స్థాయికి చేరిందనే అభిప్రాయం వినిపిస్తోంది.