05-01-2026 12:00:00 AM
కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 4 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. టీఎన్జీవో, టీజీవో, ట్రస్మా ఆధ్వర్యంలో పాల్వంచ లోని ఓ గార్డెన్ లో ఆదివారం నిర్వహించిన ’ప్రగతి టుగెదర్’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అభివృద్ధికి కావలసిన వనరులు పుష్కలంగా ఉన్నాయని..
వాటిని ఉపయోగించుకోవడంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ. .. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్డిఓ మధు, జిల్లా పరిషత్ సీఈవో విజయలక్ష్మి వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
టెట్ పరీక్షలు ప్రశాంతం...
జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) మొదటి రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తిగా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ కీలక పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
జిల్లాలో టెట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రెండు సెషన్లకు కలిపి 200 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, మొదటి సెషన్కు 44 మంది, రెండవ సెషన్కు 38 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు.
ఈ విధంగా మొదటి రోజు టెట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, అందులో 216 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరై, 184 మంది అభ్యర్థులు గైహాజరు అయినట్లు తెలిపారు. టెట్ పరీక్షల నిర్వహణలో పాల్గొన్న విద్యాశాఖ అధికారులు, కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పర్యవేక్షకులు, సిబ్బంది, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించామన్నారు.