05-01-2026 12:00:00 AM
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం, జనవరి 4 (విజయక్రాంతి): పేదలకు మౌళిక వసతుల కల్పన లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, ఏదులాపురం మునిసిపల్ పరిధిలో గత రెండు సంవత్సరాలలో 56 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేసామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంత్రి, ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించి టెంపుల్ సిటీలో 33 లక్షల 90 వేల రూపాయలతో, చిన్న తండా లో 20 లక్షల 33 వేల రూపాయలతో, సూ ర్యనగర్ లో 24 లక్షల 87 వేల రూపాయలతో, నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో 24 లక్షల 87 వేల రూపాయిలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకు స్థాపనలు చేసారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఏదులాపురం పెద్దతండా గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు సంవత్సరాల కాలంలో 14 కోట్ల రూపాయలతో వివిధ మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేశామని అన్నారు. ప్రజలకు మౌళిక వసతుల కల్పన, సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
పెద్దతండాలో నూతనంగా నివా సం ఉంటున్న ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబోయే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభిస్తుందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఉంటుందని మంత్రి తెలిపారు. రెండు సంవత్సరాల కాలంలో ఏదులాపురం పాత గ్రామ పంచాయతీలో అభివృద్ధి కోసం 56 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 580 కోట్ల రూపాయలతో మున్నేరు నదికి రిటైనింగ్ వాల్ యుద్ధ ప్రాతిపదికన రాబోయే వర్షాకాలం నాటికి పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం రాబోయే 10 రోజులలో కాలనీలో అవసరమైన మరమ్మత్తు పనులు కూడా చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుర్రాలపాడు తండా లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారు నునావత్ భారతి నిర్మించుకున్న ఇంటి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి డబ్బులు జమ అయినది అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, ఆర్ అండ్ బి ఎస్‌ఇ యాకుబ్, ఇర్రిగేషన్ ఎస్‌ఇ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాధ్ బాబు, ఏదులాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.