calender_icon.png 14 September, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయకుల పేరుతో నయా ట్రెండ్..

14-09-2025 11:23:12 AM

అధికారుల ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్.

ప్రజల అవసరాలే వారి టార్గెట్.

రేగొండ మండలంలో ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగపాటు.

రేగొండ (విజయక్రాంతి): నేటి ప్రపంచంలో ఎన్నో దోపిడీలు, కేటుగాళ్ల మాయలను చూసుంటాం. సైబర్ నేరగాళ్ల గురించి వినుంటాం. కానీ ఇదొక కొత్త రకం ట్రెండ్. వారికి సోషల్ మీడియానే టార్గెట్ అందులో ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పోలీస్ అధికారులు, మండల అధికారులతో సెల్ఫీలు దిగుతారు.వాటిని ఎడిటింగ్ లు చేసి పైన ఎమ్మెల్యే, నాయకుల ఫోటోలు పెట్టి కింద వారి ఆశీర్వాదం పొందుతున్నట్టు ఎంతో వినయంగా నిల్చుంటారు. ఆ ఫోటోలను వారి వాట్సప్ స్టేటస్ లలో, స్థానిక వాట్సప్ గ్రూపులలో, సోషల్ మీడియాలలో ఫార్వర్డ్ చేస్తూ ఆ ఎమ్మెల్యే నాకు దగ్గర అంటూ, ఈ అధికారి నాతో మాట్లాడతాడంటూ, ఓ నాయకుని అండ దండ నాకు ఉందంటూ గప్పాలు కొడుతారు. ఎక్కడ మీటింగ్ లు జరిగిన ఇదంతా మనదే అంటూ బిల్డప్ లు ఇస్తూ అందరికీ వినయంగా నమస్తే లు పెడతారు. ఇక్కడి వరకు బానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలవుతుంది.

ప్రజల అవసరాలే వారి టార్గెట్. 

ఉమ్మడి రేగొండ మండలంలో 37 గ్రామపంచాయతీలు ఉన్నాయి. దీంతో ఏదోక సమస్యపై వివిధ గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్ లు, మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారి అవసరాలకు తిరుగుతుంటారు. ఒక్కోసారి వారి సమస్యలు త్వరగానే పరిష్కరించబడ్డ కొన్ని సమస్యలు వాటి తీవ్రతలను బట్టి పరిష్కారం కాక ప్రభుత్వ ఆఫీస్ ల చుట్టూ నెలల తరబడి తిరుగుతుంటారు.ఇదే అదునుగా భావించిన లీడర్లమని చెప్పుకునే కొందరు చోటా మోటా నాయకులు మీ సమస్యలను మేము పరిష్కారం చేస్తామని మాకు స్థానిక ఎమ్మెల్యే,స్థానిక నాయకులు తెలుసని వారితో మేము ఎంత చెబితే అంతా అని కాకపోతే అధికారులకు లంచం ఇవ్వాల్సి వస్తుందని అమాయక ప్రజల నుండి పై అధికారుల పేర్లు చెబుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు.ఇది నిజమని నమ్మిన ప్రజలు వారు అడిగినంత డబ్బులు ఇస్తూ ఆఫీసుల చుట్టూ కాక ఈ లీడర్ల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు.

అధికారుల పేరుతో రూ.35 వేలు వసూలు.

ఈ క్రమంలోనే ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలోని గాంధీనగర్ కు చెందిన ముగ్గురు అన్నదమ్ముల భూమి పంచాయతీ గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉంది. స్థానిక పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్ని మార్లు తిరిగిన సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ మండల స్థాయి యువ నాయకుడు జోక్యం చేసుకొని మీ భూ సమస్యను నేను పరిష్కారం చేసి హద్దులు వేసి ఇస్తానని అధికారులకు డబ్బులు అందజేయాలని అక్షరాల రూ.35000 వేలు వసూలు చేసినట్టు సమాచారం.కానీ పంచాయతీ సెటిల్మెంట్ కాకపోవడం నెలల తరబడి పెండింగ్ లో ఉండడం నమ్మకం కోల్పోయిన బాధితులు మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని కోరడంతో వాయిదాల మీద వాయిదాలు పెడుతూ నానా అవస్థలు పెడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

నాయకుల తీరుతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పై విమర్శలు.

ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలోని కొందరి యువ నాయకుల తీరుతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది.వారి అవసరాలకు ఎమ్మెల్యే పేరు చెప్పి అధికారులను నమ్మించడం ఆపై అధికారుల పేర్లతో డబ్బులు వసూలు చేయడం.దీంతో ఎమ్మెల్యేకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అంటూ ప్రతిపక్ష నాయకులు అనడంతో ప్రజల్లో ఎమ్మెల్యే ప్రతిష్టకు భంగం  వాటిల్లుతుంది.