14-09-2025 11:37:31 AM
లండన్: లండన్ లో భారీ వలస వ్యతిరేక ర్యాలీ(Anti-Immigration Rally) జరిగింది. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి లక్ష మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అదే సమయంలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా మరొక నిరసన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో నిరసనకారులు పోలీసులపై దాడి చేశారు. సెంట్రల్ లండన్‌లో నిన్న జరిగిన ర్యాలీ యూకే చరిత్రలో అతిపెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. 'యునైట్ ది కింగ్‌డమ్' ప్రదర్శనకు వలస వ్యతిరేక కార్యకర్త టామీ రాబిన్సన్(Tommy Robinson) నాయకత్వం వహించారు.
అదే సమయంలో 'స్టాండ్ అప్ టు రేసిజం' అనే జాత్యహంకారానికి వ్యతిరేకంగా మరొక నిరసన కూడా జరిగింది. దీనికి ఐదువేల మంది ప్రజలు హాజరయ్యారు. రెండు గ్రూపుల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా నిరోధించడానికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కాగా, నిరసనకారులను నియంత్రించేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపై నీటి సీసాలు, వివిధ వస్తువులతో దాడి చేశారు. ఈ సంఘటనలో 26 మంది అధికారులు గాయపడగా.. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.