7 August, 2026 | 11:57 AM

విపత్తులను అధిగమించేలా శాశ్వత పరిష్కారం

03-09-2025 12:00 AM

ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాం.. కలెక్టర్ రాహుల్ రాజ్

చేగుంట, సెప్టెంబర్ 2 : భవిష్యత్తులో జిల్లాలో భారీ విపత్తులను అధిగమించే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా  నిర్మాణాలు చేపట్టే విధంగా  ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం  చేగుంట మండల కేంద్రంలో అనంతసాగర్ గ్రామంలో వర్షాల తాకిడికి దెబ్బతిన్న ఇండ్లను, ఇబ్రహీంపూర్ లో రోడ్డు మరమ్మత్తులకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీరాజ్, హౌసింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

జిల్లాలో భారీ వర్షాలు, వరదల వలన అపార నష్టం వాటిల్లిన మేరకు క్షేత్రస్థాయిలో నష్ట అంచనాలు జరుగుతున్నాయన్నారు. హవేలీ ఘన్పూర్, శంకరంపేట, రామాయంపేట, చేగుంట పెద్ద మండలాల్లో పెద్ద ఎత్తున వరద నష్టంతో కల్వర్టులు, కాజ్వేలు, రోడ్లు కోతకు గురైనట్లు తెలిపారు.

సెప్టెంబర్ నెలలో కూడా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లాలో వారం రోజులపాటు ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమంతో పాటు ఫీవర్ సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట తహసిల్దార్ శ్రీకాంత్, సంబంధిత పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, హౌసింగ్ అధికారులుపాల్గొన్నారు.