2 July, 2026 | 9:12 AM

నకిలీ నోట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

12-06-2024 02:03 AM

రూ.18 లక్షల విలువ చేసే నకిలీ కరెన్సీ పట్టివేత

అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

రాజేంద్రనగర్, జూన్ 11 :  నకిలీ నోట్లు తరలిస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న ఫేక్ కరెన్సీతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఎం.భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం కొప్పల్ తాలూకా హోస లింగాపుర గ్రామానికి చెందిన కొరచ మురుగేష (25) జేకే కంప్యూటర్స్ అండ్ జిరాక్స్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో మురుగేష అన్న కొరచ రవిచంద్ర (42), అతని అన్న కొడుకు కొరచ యోగేష్ (22)లతో కలిసి రూ.500 నోట్లను ముద్రించాడు. శంషాబాద్‌లోని ఓ వ్యక్తికి నకిలీ నోట్లు ఇవ్వడానికి బైక్‌పై వస్తుండగా తొండుపల్లి గ్రామ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి నకిలీ నోట్ల కట్టలు ఉన్న బ్యాగ్, రూ.18 లక్షల విలువ చేసే నకిలీ రూ.500 నోట్లు, ఒక సెల్‌ఫోన్, రూ. 6500 నగదు, పల్సర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.