16-12-2025 01:50:20 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం కలకలం రేపింది. వినయ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ అత్యవసర విచారణకు స్వీకరించింది.
డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను, సూచనలను అధికారులు కనీసం పట్టించుకోలేదని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. తాను సమర్పించిన అభ్యంతరాలను కూడా ప్రభుత్వం పక్కనబెట్టిందని, వాటిని పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.
ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో.. హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.