16-12-2025 01:48:03 AM
వార్డుల పునర్విభజనతో సమాన రాజకీయ ప్రాతినిధ్యం: మంత్రి పొన్నం
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రజలకు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉండటం కోసమే చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాస్త్రీయంగా వార్డుల పునర్విభజన జరగడం వల్ల ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని, వార్డుల పునర్విభజన వల్ల పాలన వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మెరుగైన పాలన అందించవచ్చు అని సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కార్పొరేటర్లు ప్రజల క్షేత్ర సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించగలుగుతారని, జీహెచ్‌ఎం సీలో విలీనమైన 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్‌లను సమంగా అభివృద్ధి చేయడం సులభమవుతుందని వెల్లడించారు. స్మార్ట్ సిటీ, మెట్రో, ఎక్స్‌ప్రెస్ కారిడార్‌ల నిర్మా ణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, పర్యావరణ ప్రణాళికలకు డీలిమి టేషన్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. డీలిమిటేషన్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యంతరాల స్వీకరణ చేపట్టినట్టు తెలిపారు. పుర ప్రజలు ఏమైనా అభ్యంతరాలు ఉంటే జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో తెలుపవచ్చని సూచించారు.