2 March, 2026 | 6:16 AM

సంప్రదాయాలకు పెద్దపీట

02-03-2026 01:19 AM
  1. కళాకారులకు పూర్వవైభవం తీసుకువస్తాం
  2. దేవాలయాలు, టూరిజం, సంస్కృతి మేళవింపుతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
  3. భక్త రామదాసు గొప్ప వాగ్గేయకారుడు
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  5. ఎల్బీ స్టేడియంలో ఘనంగా రామదాసు జయంత్యుత్సవాలు  

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 01 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం  ఆత్మ ఇక్కడి కళల్లోనే ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన భక్త రామదాసు జ యంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ నేల గర్వించదగ్గ గొప్ప వాగ్గేయకారుడు భక్త రామదాసు అని కొనియాడారు. రాష్ట్రంలోని కళాకారులకు  పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని చారిత్రక దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు సంస్కృతిని మేళవిస్తూ ఒక సమ గ్రమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప వంటి ప్రపంచ వారసత్వ కట్టడాలు, పురాతన ఆలయాలను కలుపుతూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సంగీత నాటక అకాడమీకి సూచించారు. కళలు కేవలం వినోదం కోసమే కాకుండా, ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ గ్రామాల్లోని ప్రతి సమస్యకు కళారూపాల ద్వారానే పరిష్కారం చూపిన గొప్ప చరిత్ర మనకు ఉందని గుర్తుచేశారు.

ఖమ్మం జిల్లా నీలకొండపల్లిలో జన్మించిన కంచెర్ల గోపన్న, తన భక్తి కీర్తనలతో భక్త రామదాసుగా చిరస్థాయిగా నిలిచిపోయారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయన కట్టిన భద్రాచలం ఆలయం, రాసిన కీర్తనలు ప్రతి తెలుగువారి గుండె ల్లో నిలిచిపోయాయని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత మన ప్రాంత వాగ్గేయకారుల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఇటువంటి ఉత్సవాలను ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

సంగీ త నాటక అకాడమీ భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని, దానికి అవసరమైన పూర్తి ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను కళారూపాల ద్వారా ప్రజలకు వివరించిన తీరు అద్భుతమని డిప్యూటీ సీఎం అభినందించారు. 

మన కళలను కాపాడుకోవడం అంటే మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమేనని, కళాకారులు ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ ప్రతినిధులు, పలువురు కళాకారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.