నలుగురిని కరిచిన పిచ్చికుక్క
- రెండురోజుల్లో 9 మందిని కరిచినా పట్టించుకోని అధికారులు
- ప్రయత్నించినా తప్పించుకుంటోందన్న ఈవో
నార్సింగి/చేగుంట, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): నార్సింగి మండల కేంద్రంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. మంగళవారం ఓ చిన్నారిని తీవ్రంగా గాయపరచడంతో పాటు మరో ముగ్గురిని కరిచింది. సోమవారం ఇదే కుక్క ఒకటవ వార్డులో ఐదుగు రిని కరిచింది. వీరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం మెదక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఐదో వార్డులో ఇంటి వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల షానవాజ్‌ను కుడి చేతిపై కరువగా రక్త గాయంతో పాటు ఎముక సైతం రెండుగా విరిగింది.
తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్లగా ప్రథమచికిత్స అనంతరం మెదక్ ప్రభుత్వ ఆసుప త్రికి అటు నుంచి పిల్లికొట్యాల్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిచ్చికుక్క రెండు రోజులలో 9 మందిని కరిచినా ఇంత వరకు దానిని పట్టుకోవలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వెంటనే కుక్కలను నిర్మూలించాలని, లేకుంటే ఇంకా ఎంత మంది దాని బారిన పడాల్సి వస్తుందో? అని ఆందోళన చెందుతున్నారు
కుక్కకాటుకు గురైన క్షతగాత్రు లను నార్సింగి ఉపసర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్ గౌడ్, వార్డు సభ్యులు ఆటో జానీ, బాచి స్వామి, కటికె రాజేందర్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా మందుల కోసం ఉపసర్పంచ్ రాజేందర్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు.
ఈఓ నాగభూషణం వివరణ..
పిచ్చి కుక్క స్వైర విహరం ప్రజలను కరవడంపై నార్సింగి ఈఓ నాగభూషణంను వివరణ కోరగా కుక్కను పట్టుకునే ప్రయత్న చేస్తున్నామన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసి నా తప్పించుకుంటోందని, పట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు.






