calender_icon.png 13 October, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజనులకు ఆదర్శప్రాయుడు

09-10-2025 12:00:00 AM

కులాల కుంపట్లతో దేశ వ్యవస్థ లు, రాజకీయాలు మలినమవుతున్న తరుణంలో దేశ బహుజనుల బతుకులు మార్చడానికి అలుపెరుగని పోరాటం చేశారు మాన్యశ్రీ కాన్షీరామ్. ‘ఓట్లు మావి.. సీట్లు మీవా’ అని నినదిస్తూ భారత రాజకీయ యవనికపై తన పోరా టం సాగించారు. 1934 మార్చి 15న పం జాబ్ రాష్ర్టంలోని రోపార్ జిల్లాలో గల కావాస్ పూర్ గ్రామంలో చమార్ కులాని కి చెందిన రాందాసియా సిక్కు కుటుంబం లో జన్మించారు.

పాఠశాల విద్య పూర్తయ్యేంతవరకు తన కులం గురించి పూర్తిగా తెలియని కాన్షీరామ్ 1956లో రోపార్ ప్రభుత్వ కళాశాల నుంచి బీఎస్సీ పట్టా పొందారు. ఆ తర్వాత పూణేలోని ‘ఎక్స్ ప్లోజివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ’ కార్యాలయంలో సైంటిస్ట్ ఉద్యోగం లో చేరాడు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు అతని జీవితాన్ని మార్చేయడమే గాకుండా ఒక లక్ష్యం ఏర్పాటయ్యేలా చేసింది. ఆ లక్ష్యమే, ఆ సంకల్ప బలమే భారత రాజకీయాలను ఒక మలుపు తిప్పింది. అంబేడ్కర్ రచించిన కులనిర్మూలన పుస్తకంతో ప్రభావితమై భారతదేశ కులవ్యవస్థలో అట్టడుగున అంటరానితనంతో మగ్గుతున్న వారిని, వెనుకబడిన జాతులను సమాజంలో భాగస్వామ్యం చేయాలని నిశ్చయించుకుని ఆర్‌పిఐ పార్టీ మద్దతుదారుగా తన మలిదశ ప్రస్థానానికి నాంది పలికారు.

నిరంతర పోరాటం

1971లో దళిత్ శోషిత్ సమాజ్ సంఘ ర్ష్ సమితి ఏర్పాటు చేసిన కాన్షీరామ్.. 1978లో దీనిని ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్స్, మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌గా మార్చారు.  ఈ సంస్థ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఉద్యోగులను దేశవ్యాప్తంగా సమీకరించి.. అంటరానితనం, అస్పృశ్యత, నాటి సమాజంలో నెలకొన్న  మనిషిని మనిషిగా చూ డని సామాజిక రుగ్మతలపై ఆరా తీశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా నిరంతరం పరిశ్రమించారు. గౌత మ బుద్ధుడు, మహాత్మ జ్యోతిరావు పూలే, పెరియర్ ఇవి రామస్వామి నాయకర్, నారాయణ గురు, అంబేద్కర్‌లను  తన గురువులుగా ప్రకటించుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ బహుజన సమాజ హితం కోరుతూ, దేశంలోని అగ్రకుల వ్యవస్థీకృత రాజకీయాలను ప్రక్షాళన చేయడం కోసం నడుం బిగించారు.

ఈ నేపథ్యంలోనే 1984 ఏప్రిల్ 14న (అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని) బహు జన్ సమాజ్ పార్టీని స్థాపించారు. ఇది భారత దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన సంఘటన. బుద్ధుడు, అంబేద్కర్ భోధనలతో తీవ్రంగా ప్రభావితుడైన కాన్షీరామ్, కూటికి లేని జనాన్ని కూడగట్టి వారిలో రాజ్యాధికార కాంక్షను రగిలించడంలో విజయవంతమయ్యారు. అలా వెలివాడల అందరికీ తొలిపొద్దు అయ్యా రు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఏకం చేయడంలో కృతకృత్యుడైన కాన్షీరామ్ స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీని దేశంలోని అతిపెద్ద మూడవ జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో సఫలమయ్యారు. 

బీసీలకు న్యాయం జరిగేలా

రాజకీయ దర్పానికి, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ తను నమ్మిన సిద్ధాం తం కోసం నిర్విరామంగా పనిచేసిన కాన్షీరామ్ దేశ బహుజనులకు ఆదర్శ ప్రాయు డయ్యారు.  అంబేద్కర్ మరణంతో అసంపూర్తిగా అగిపోయిన మిషనరీ వర్క్ ని తాను పూర్తి చేస్తానని చెప్పిన కాన్షీరాం బహుజన సమాజంలో విప్లవాత్మక చైతన్యాన్ని రగిలించాడు. ‘దేశ్ కీ నేత కైసా హో కాన్షీరాం జైసాహో’..  ‘దేశ నేత అంటే ఇ లా ఉండాలి అనేలా బహుజనుల ద్వారా మెప్పు పొందారు. ఏ భూమి అయితే ప్రభుత్వానిదో ఆ భూమి మనదే అంటూ ఆయన సమాజాన్ని చైతన్యపరిచాడు, కులాన్ని నిర్మూలిద్దాం బహుజన సమాజాన్ని నిర్మిద్దాం, ఎవరి జనాభా ఎంతో వారి భాగస్వామ్యం కూడా అంతే ఉండాలన్నారు.

బ్రాహ్మణులు, వైశ్యులు, ఠాకూ ర్లు మినహా తక్కిన వారంతా డిఎస్4 అని విప్లవాత్మక నినాదమిచ్చారు. నిధులు ఇచ్చిన వారే విధులు కూడా చెప్తారని బహుజన సమాజాన్ని ఒక నోటు ఇస్తూ ఓటు వేయమని అభ్యర్థించాడు. విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకపోవడం మూలంగా 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం జరుగుత లేదని భావించి మండల్ కమిషన్ అమలయ్యేలా ఢిల్లీలో 46 రోజుల పాటు మహాధర్నా చేసి నేడు 27శాతం బీసీలు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందేలా మహాత్తరమైన పోరా టం సాగించారు.

నమ్మిన సిద్ధాంతం కోసం..

2006, అక్టోబర్ 9న కాన్షీరామ్ మరణం కోట్ల మంది బహుజనులకు గుండె కోతను మిగిల్చింది. రాజకీయ అంధకారం అలుముకున్న బహుజనుల చీకటి వాడల్లో సూర్యుడిలా ఉదయించి, దేశంలోనే అతిపెద్ద రాషమ్రైన ఉత్తర ప్రదేశ్‌కు మాయావతిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని దేశంలోని బహుజనులకు ఒక బలమైన రాజకీయ వేదికతో పాటు, దాని ఫలాలు అందించిన మహనీయుడిగా కాన్షీరామ్ గుర్తింపు పొందారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో ఓట్లు, సీట్లు సాధించి ఎందరో రాజనీతిజ్ఞులకు అంతు చిక్కని పాఠాలు నేర్పారు. అంతే ఆదర్శం గా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం అతని సొంతం.

బీఎస్పీ పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, సోషల్ రిఫార్మ్ చేసే మిషన్ అని పేర్కొన్నారు. గెలుపు, ఓటము లు లెక్క కాదని.. గొప్ప వ్యక్తుల ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకుపోవడమే తమ లక్ష్యమని గంభీరంగా ప్రకటించారు. అంబేద్కర్ మరో రూపంగా, బహుజనులకు ఆరాద్యుడిగా కాన్షీరామ్ మారా రనడంలో సందేహం లేదు. నూటికి 85 శాతం ఉన్న కూటికి లేని జనాల కోసం తమ జీవితకాలం వెచ్చించి వారిని మనుషులుగా తయారు చేయాలని, దానిని ఒక యజ్ఞంలా భావించి నిరంతరం పరితపించిన కాన్షీరామ్‌కు ఇదే ఘనమైన నివాళి. అంబేడ్కర్ ఆలోచన విధానం పునాదిగా కాన్షీరామ్ ఆవలంభించిన పని విధానంలోనే బహుజన యువత రాజకీయాల్లో ముందడుగు వేయాలని కోరుకుందాం.