09-10-2025 12:00:00 AM
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ఒకప్పుడు ఉద్యోగులకు కలల ప్రపంచం. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వస్తే చాలు రెండు చేతు లా సంపాదిస్తూ హాయిగా జీవించేయొచ్చని కలలు కన్నవారెందరో. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న తలతిక్క నిర్ణయాలతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఢీలా పడుతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న సాంకేతికతను అందిపుచ్చుకోలేక ఉద్యోగాలు కోల్పోతున్న టెకీలు కోకొల్లలు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటం, కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విపరీతంగా పెరిగిపోతుండడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, అమెజాన్, యాక్సెంచర్ లాంటి దిగ్గజ సంస్థలు లేఆఫ్స్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తున్నాయి.
ఐటీ రంగంలో ప్రస్తు తం ఆటోమేషన్, ఏఐ సహా కొత్త టెక్నాలజీలు హల్‌చల్ చేస్తున్నాయి. చాలా ఐటీ కంపెనీలు ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నాయి. దీంతో ఉన్న ఉద్యోగులకే కొత్త డిజిటల్ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి వినియోగించుకుంటున్నాయి. ఆ టెక్నాలజీలపై పట్టు సాధించలేని ఉద్యోగులను ఇంటికి పంపి స్తున్నాయి. మరోవైపు ఆర్థిక అనిశ్చితి కూడా ఐటీ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో అమెరికా, ఐరోపా దేశాల్లో అనిశ్చితి మరింత పెరిగింది. ఇటీవలే అమెరికా హెచ్ వీసాల ఫీజును ఎడాపెడా పెంచేయడం కూడా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో విదేశాల నుంచి భారత ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు రావడం తగ్గిపోయింది.
దీంతో ఆయా కంపెనీల్లో బెంచ్ మీద ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. వీళ్ల ఖర్చును భరించలేక ఇంటికి పంపించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఇందులో భాగంగానే ‘పునర్నిర్మాణ కార్యక్రమం’ పేరుతో టెక్ కంపెనీలు కొత్త చాప్టర్‌కు తెరతీశాయి. అంటే ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఏదైనా కారణం చెప్పి ఉద్యోగుల విధుల నుంచి తొలగించవచ్చు. ఇటీవలే యాక్సెంచర్ సంస్థ గత మూడేళ్లలో ఉద్యోగుల తొలగింపు కోసమే 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడమే అందుకు ఉదాహరణ. గత త్రైమాసికంలోని యాక్సెంచర్ కంపెనీ 11, 419 మంది ఉద్యోగులను తొలగించి ఒక బిలియన్ డాలర్ ఆదాయాన్ని ఆదా చేసుకున్నట్లు సంస్థ తెలిపింది.
దేశీయ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కూడా ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో 12 వేల మందిని, మైక్రోసాఫ్ట్ 9వేల మందిని తొలగించే పనిలో ఉన్నాయి. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ రంగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి. 2022, 2023 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 వేల కంపెనీలు 4 లక్షల పైచిలుకు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. 2024లో దాదాపు 549 కంపెనీలు.. లక్షా 50 వేల మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించేయడం గమనార్హం. అయితే ఎన్ని ఒడిదుడుకులున్నా దేశీయంగా ప్రతీ ఏటా స్టెమ్ గ్రాడ్యుయేట్లు విరివిగా వస్తూనే ఉన్నారు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్ నగరాలు భారతీయ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందాయి. ట్రంప్ నిర్ణయాలతో విదేశాలకు వెళ్లేందుకు జంకుతున్న టెక్ నిపుణులకు స్వదేశీ కంపెనీలు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతుండడం ఔత్సాహికం అని చెప్పొచ్చు. ఈ విధానాన్ని భారత్‌కు చెందిన అన్ని ఐటీ కంపెనీలు ప్రోత్సహించాల్సిన అవసరముంది.