గల్ఫ్ గడ గడ
అమెరికా సైనిక చర్యకు ఇరాన్ మెరుపుదాడులు
మళ్లీ హోర్ముజ్ మూసివతే
కువైట్, బహ్రెయిన్, ఖతర్, యూఏఈ, జోర్డాన్ అప్రమత్తం
వాషింగ్టన్/టెహ్రాన్/టెల్‌అవీవ్, జూలై 12: అమెరికా తాజా దాడుల్లో 140 ఇరాన్ లక్ష్యాలను ఛేదించిన అనంతరం టెహ్రాన్ తిరిగి ప్రతీకారం తీర్చుకోవడంతో గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గల్ఫ్‌లోని పలు అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఇటు సైనిక చర్యలను అమెరికా విస్తరిస్తోంది. మూల్యం చెల్లించుకోవాలని ఇరాన్‌ను హెచ్చరిస్తోంది.
అటు ప్రతీకారంతో రగిలిపోతున్న టెహ్రాన్ బహు ముఖ వ్యూహాలను అనుసరిస్తోంది. మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అమెరికా ఏకపక్ష ఒప్పందాల శకం ముగిసిందని, ‘వాస్తవం మీ తలుపు తడుతోంది’ అని ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. దీంతో కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, జోర్డాన్ అత్యవసర భద్రతా చర్యలను చేపట్టాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు ఉరుముతున్నాయి.
గత వారంలో ఇరాన్‌పై అమెరికా దళాలు మూడో విడత దాడులను పూర్తి చేశాయని, సుమారు 140 సైనిక స్థావరాల ను లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఈ సమన్వయ ఆపరేషన్‌లో యుద్ధ విమానాలు, డ్రోన్లు, నౌకాదళ నౌకల నుంచి ప్రయోగించిన ఖచ్చితత్వంతో కూడిన క్షిపణులను ఉపయోగించి క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలు, నౌకాదళ ఆస్తులు, మందుగుండు సామగ్రి డిపోలు, కమ్యూనికేషన్ నెట్వర్క్‌లను, తీరప్రాంత నిఘా సౌకర్యాలపై దాడి చేశారు.
ఇరాన్ సైనిక సామర్థ్యాలను గణనీయంగా దెబ్బతీయడమే ఈ ఆపరేషన్ ఉద్దేశమని అమెరికా పేర్కొంది. అయితే ఇరాన్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు వార్తలు వెలువడటంతో, ఇరాన్ ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని బందర్- ఏ మహ్‌షహర్‌లో తన వాయు రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది. హెండిజాన్, మహ్‌షహర్, అబాదాన్‌లపై దాడులు జరిగినట్లు యంత్రాంగం, ప్రభుత్వ మీడియా తెలిపాయి.
బుషెహర్ నగరం, బందర్- ఎ దేర్, అసలుయే, కంగన్‌తో సహా బుషెహర్ ప్రావిన్స్‌లో అనేక పేలుళ్లు వినిపించాయి. హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని దక్షిణ ఓడరేవు పట్టణమైన జాస్‌కోలో10కి పైగా పేలుళ్లు సంభవించగా, బుషెహర్ సరిహద్దు సమీపంలో అదనపు పేలుళ్లు జరిగాయి. మరోపక్క మళ్లీ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అనుమతి లేని మార్గాల గుండా ప్రయాణిస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ మూల్యం చెల్లించుకోవాలి: అమెరికా
సైనిక చర్యలు తీవ్రతరం అవుతున్న తరుణంలో, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘ఇరాన్ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దాని మూల్యం చెల్లిస్తోంది’ అని ఆయన హెచ్చరించారు. మరోవైపు, అమెరికా-, ఇజ్రాయెల్ ‘దురాక్రమణలు’ కొనసాగితే ‘మరింత వినాశకరమైన’ ప్రతిస్పందనలు చోటుచేసుకుంటాయని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.
ఇది గల్ఫ్ అంతటా సైనిక ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని సూచించింది. ‘ఏకపక్ష ఒప్పందాల’కు వ్యతిరేకంగా అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. తీవ్రమవుతున్న ఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ అగ్ర సంధానకర్త మహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ అమెరికాకు తీవ్ర హెచ్చరిక జారీ చేస్తూ, ‘ఏకపక్ష ఒప్పందాల శకం ముగిసింది’ అని ప్రకటించారు.
తీవ్రమైన పదజాలంతో కూడిన ఒక సందేశంలో, ‘మేము మీకు చెప్పాం. మీ మాట నిలబెట్టుకోండి లేదా మూల్యం చెల్లించుకోండి. వాస్తవం తలుపు తడుతోంది’ అని ఖాలిబాఫ్ అన్నారు. తాజా అమెరికా దాడుల తర్వాత టెహ్రాన్ వైఖరి మరింత ఘర్షణాపూరితంగా మారుతోందనడానికి ఇది సంకేతం. ఇరాన్‌పై సైనిక చర్యలు కొనసాగితే మరిన్ని ప్రతీకార చర్యలు తీసుకుంటామని శపథం చేసిన సీనియర్ ఇరాన్ అధికారుల హెచ్చరికల పరంపరకు ఆయన వ్యాఖ్యలు తోడయ్యాయి.
అత్యంత అప్రమత్తంగా గల్ఫ్
క్షిపణి నిరోధక చర్యలు జరిగినట్లు నివేదికలు రావడం, అత్యవసర హెచ్చరికలు జారీ కావడం, పలు దేశాల నుంచి పరస్పర విరుద్ధమైన సైనిక హెచ్చరికలు వెలువడుతుండటంతో గల్ఫ్ దేశాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. యూఏఈ, కువైట్, ఖతర్, జోర్డాన్, బహ్రెయిన్ దేశాలు వాయు రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. ప్రాంతీయ భద్రతా హెచ్చరికలు, కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యలతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం ఉరుముతోందని స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల, ఉద్రిక్తత మరింత పెరిగితే, మరిన్ని గల్ఫ్ దేశాలు నేరుగా ఈ ఘర్షణలోకి దిగవచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
23న ప్రజల ముందుకు సుప్రీంలీడర్ మొజ్తాబా?
ఖమేనీ స్మారక సభకు వచ్చే అవకాశం
టెహ్రాన్, జూలై 12 (విజయక్రాంతి): టెహ్రాన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభ జూలై 23న నిర్వహించనున్నట్లు దేశ సుప్రీంలీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ పాల్గొంటారని ఆదివారం ఇరాన్ ప్రకటించింది. ఈ సభ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య నిర్వహిస్తారని పేర్కొంది. ఈ కార్యక్రమంలో కీలక నాయకులందరూ పాల్గొంటారని తెలిపారు. రెండువారాల కింద తన సతీమణి అంత్యక్రియల్లోనూ మొజ్తాబా కనిపించలేదు.
ఈ సమా వేశాన్ని అమరవీరుడు ముజాహిద్ ఇమామ్క్‌కు నివాళి అర్పించే సమా వేశంగా పేర్కొన్నారు. ఖమేనీ సంతాప సభలో ఆయన ముగ్గురు సోదరులు హాజరైనా, మొజ్తాబా మాత్రం పాల్గొన లేదు. కాగా శనివారం మొజ్తాబా ఖమేనీ తన తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకుం టానని ప్రతిజ్ఞ చేసిన పోస్టులు విడుదల చేశారు. అయితే ఈ స్మారక సభలో మొజ్తాబా ఖమేనీ పాల్గొంటారా? లేదా? అనేది మాత్రం ఆ ప్రకటనలో ధృవీకరిం చకపోవడం గమనార్హం.






