తాతయ్య ఆదర్శాలను కొనసాగిస్తున్న సామాజికవేత్త
ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తున్న పుట్టా రామకృష్ణ
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు సహకారం
జూబ్లీహిల్స్, ఆగస్టు 14 (విజయక్రాంతి): తన తాతయ్య ఆదర్శాలను కొనసాగిస్తూ ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు సామాజికవేత్త పుట్టా రామకృష్ణ.తాతయ్య పుట్టా అమరయ్య శ్రేష్టి స్ఫూర్తితో గత రెండు దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తు న్నారు. ప్రజలకు తన వంతు నిస్వార్థ సేవను చేస్తూ మంచి తనాన్ని చాటుకుంటున్నారు.
పుట్టా అమరయ్య నేపథ్యం
మాడుగుల ప్రాంతానికి చెందిన పుట్టా అమరయ్య శ్రేష్టి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పిలుపుతో ఉన్నత విద్యను మధ్యలోనే వదిలి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలోనూ భాగస్వాములై బ్రిటిష్ పాలకుల నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. స్వాతంత్య్రం అనంతరం కూడా ప్రజా సేవకు అంకితమై పేద రైతులు, విద్యాభివృద్ధి కోసం కృషి చేశారు.
తాత చూపిన బాటలో..
తాత అమరయ్య శ్రేష్టి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్న రామకృష్ణ ఆయన చూపిన బాటలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా రక్తదానాన్ని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఇప్పటివరకు 75 సార్లకు పైగా రక్తదానం చేసినట్లు తెలిపారు. తనతో పాటు ఇతరులను కూడా రక్తదానానికి ప్రోత్సహిస్తూ అనేక మందికి రక్తం అందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు
హైదరాబాద్లో వరదల సమయంలో దాతల సహకారంతో నిరుపేదలకు ఆహార పొట్లాల సరఫరా, అన్నదానం వంటి కార్యక్రమాలను పుట్టా రామకృష్ణ నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ట్రాన్స్జెండర్లు, సినీ కార్మికులు, పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి వారికి అండగా నిలిచారు. సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కూడా రామకృష్ణ పలు కార్యక్రమాలు చేపట్టారు.
మద్యం విక్రయాలకు ఆధార్ లింక్ చేయాలని..
2017లో మద్యం విక్రయాలను ఆధార్తో అనుసంధానం చేయాలనే డిమాండ్తో విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక ఉద్యమాన్ని చేపట్టారు. మూడు లక్షల పోస్టుకార్డులను ప్రధానమంత్రి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించారు. తన డిమాండ్ సాధన కోసం ఇప్పటికీ పోరాడుతున్నారు.
నిరుద్యోగ యువత ఉపాధికి భరోసా
చాలా మంది యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక నిరాశనిస్పృహలకు గురవుతుంటారు. అలాంటి వారికి పుట్టా రామ కృష్ణ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ప్రైవేటు రంగంలో తనకున్న పరిచయాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలను క ల్పిస్తున్నారు. వారికి ఉపాధి కల్పన కోసం తన వంతు సహకారం అందిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని, అందుకు దాతలు, ఔత్సాహికులు తగిన సహకారం అందించాలని పుట్టా రామకృష్ణ కోరుతున్నారు.






