ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
వనపర్తి, ఆగస్టు 14 (విజయక్రాంతి) : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, మౌలిక వసతులను పరిశీలించారు. జ్వరంతో వచ్చే రోగులకు మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని, టిబీ పరీక్షలను కూడా పెంచాలని సూచించారు.
సీటీ స్కాన్ కేంద్రం వద్ద రోగులు, సహాయకుల కోసం షెడ్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూడీఐడీ కార్డుల పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. మదనాపురం మండలంలో పాముకాటుతో బాలుడు మృతి చెందిన ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ, పాముకాటు కేసుల్లో వెంటనే చికిత్స అందించి ప్రాణాలను కాపాడేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






