24-05-2025 11:20:05 PM
తీవ్ర గాయాలతో ఖమ్మం ఆసుపత్రికి తరలింపు..
భద్రాద్రి కొత్తగూడెం/కూసుమంచి (విజయక్రాంతి): కల్లు గీత కార్మికుడు మంద వెంకన్న గౌడ్(60) కల్లు కోసం తాటి చెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా(Khammam District) కూసుమంచి తాటి వనంలో చోటుచేసుకుంది. మండల కేంద్రమైన కూసుమంచికి చెందిన కల్లు గీత కార్మికుడు మంద వెంకన్న గౌడ్ గత నాలుగు దశాబ్దాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే పొలాల్లోని తాటి వనానికి వెళ్లి మోకు ముస్తాదుతో తాటి చెట్టు ఎక్కి గెల గీసి కల్లు తీసుకొని క్రిందకు దిగుతున్నాడు. మధ్యలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి కింద పడ్డాడు.
నడుముకు, తలకు, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తాటి చెట్టుపై నుండి వెంకన్న కింద పడటాని గమనించి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే 108కు ఫోన్ చేసి అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డి సి హెచ్ ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ గవర్నమెంట్ సూపర్డెంట్ డాక్టర్ కిరణ్ వెంకన్నకు మరుగైన చికిత్స అందించాలని సూచించారు, ఆసుపత్రిలో వైద్యులు అతనికి చికిత్స చేస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన గౌడ సంఘ నాయకులు జరిగిన సంఘటన వివరాలను ఎక్సై జ్ శాఖ అధికారులకు, పోలీసులకు కంప్లీట్ ఫిర్యాదు చేశారు.