16-12-2025 01:22:56 AM
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్
కరీంనగర్, డిసెంబరు 15 (విజయ క్రాంతి): రబీలో దించిన ధాన్యానికి సరిపడా బాయిల్ రైస్ టార్గెట్ ఇవ్వాలని కరీంనగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి నర్సింగరావు అధ్యక్షతన సోమవారం నగరంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లర్లు పలు డిమాండ్ లను ప్రభుత్వం ముందు ఉంచారు. 202526 ఖరీఫ్ కు సంబంధించిన సుమారు 3,10,000 మెట్రిక్ టన్నుల తడిచిన, మొలకెత్తిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వానికి సహకరించి దించుకున్నామని, కానీ మా అసోసియేషన్ సభ్యులైన 29 మందికి డీఎస్వో నోటీసులు ఇచ్చారని తెలిపారు.
2024-25 ఖరీఫ్ తో పోలిస్తే మా మిల్లర్లు ఎక్కువగా దించుకున్నారని, ఈ 29 మంది కంటే తక్కువ దించుకున్నవారికి కూడా నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. రబీ 2024-25 లో 40,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాకు అలాట్మెంట్ వచ్చిందని, దాని వివరాలు అధికారులు ఇవ్వడం లేదని, వెంటనే వివరాలు ఇప్పించాలని కోరారు. అధికారులు కొంతమంది మిల్లర్లు సహకరిస్తూ, మిగతా మిల్లర్లకు సహకరించడం లేదని, దీంతో మా సంఘంలో బేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. కొంతమంది మిల్లర్లు డీఫాల్ట్ అవుతున్నారని తెలిపారు.
గత రెండు నెలలుగా ఎక్కువ రైస్ మిల్లులు మూతపడి ఉన్నాయని, దీంతో మిల్లర్లకు ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రబీలో దించిన ధాన్యానికి సరిపడా బాయిల్ టార్గెట్ ఇప్పించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదరుశలు తొడుపు నూరి కరుణాకర్, జి రాజమౌళి, కోశాధికారి జి అనంద రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.