16-12-2025 02:16:30 AM
కోదాడ, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : పదవీ వ్యామోహం ఆయనను ఉద్యోగానికి సైతం రాజీనామా చేసేలా ప్రేరేపించింది. తీరా రాజీనామా చేసి బరిలోకి దిగితే ఓటమి పాలు కావడంతో నిరాశే మిగిలింది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు కోదాడ టౌన్ ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. తన పదవీ విరమణ సమయం కేవలం నాలుగు నెలలే ఉందని అదే ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఐదేండ్లు సర్పంచ్ కావొచ్చన్న ఆశపడ్డాడు.
అనుకున్నదే తడువుగా వెంటనే తన ఎస్‌ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గుడిబండ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగాడు. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో అదే పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నాగయ్య చేతిలో ఓటమి పాలయ్యాడు. సర్పంచ్ పదవి మీద కాంక్షతో బరిలోకి దిగిన వెంకటేశ్వర్లుకు ఆది అందని ద్రాక్షలా మారి నిరాశే మిగిలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.