15 April, 2026 | 3:16 AM

రాజ్యాంగ నిర్మాతకు నీరాజనం

15-04-2026 12:50 AM

రంగారెడ్డి, ఏప్రిల్ 14(విజయక్రాంతి) భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పల్లె నుండి పట్నం వరకు పండుగ వాతావరణంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు బహుజన సంఘాల నేతలు నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకు న్నారు.

జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉత్సాహంగా పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆమనగల్ బ్లాక్  మండలాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మహేశ్వరంనియోజకవర్గంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, షాద్నగర్ లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, చేవెళ్ల లో ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఇబ్రహీంపట్నం లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లు పాల్గొన్నారు ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రూపకర్త మాత్రమే కాదు, సామాజిక న్యాయ పోరాట యోధుడు. విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక పురోగతి సాధ్యమని ఆయన నమ్మారు. యువత ఆయన చూపిన సమానత్వం, స్వాభిమానం అనే మార్గంలో నడిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని నేతలు పిలుపునిచ్చారు.

జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి రామరావు, వివిధ బహుజన సంఘాల నేతలు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు.సమానత్వమే లక్ష్యంగా, విద్యే ఆయుధంగా అంబేద్కర్ బాటలో పయనిద్దాం పలువురు అకాంక్షించారు.