calender_icon.png 29 July, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెదిరింపుల పర్వం

19-07-2025 12:00:00 AM

మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభించిన రష్యా.. ఆ దేశంతో కయ్యం పెంచుకుంటూ పోతూందే తప్ప ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈ సందర్భంలో ప్రపంచ దేశాల మధ్య అన్ని యుద్ధాలను తానే ఆపాననే భ్రమలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్నీ ఆపుతానని బీరాలు పలికారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సదస్సు సందర్భంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఫోన్‌లైన్‌లో కోరారు.

కానీ, రష్యా అధ్యక్షుడు ఎక్కడా ట్రంప్ మాట పట్టించుకున్నట్టు కనిపించలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరికలకు దిగారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా పేర్కొన్నారు. ఈ హెచ్చరికలు పరోక్షంగా భారత్‌ను కూడా తాకాయి.

ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఎలాంటి అంతర్జాతీయ అధికారిక అర్హతలు లేని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. నాటో హెచ్చరికలపై భారత్ కూడా దీటుగానే స్పందించింది. భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజాప్రయోజన కోణంలోనే ఉంటాయని, సుస్థిరమైన ఇంధన భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని తాజాగా భారత విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

మార్కెట్‌లో తక్కువ ధరకు చమురు లభించే దేశంలో కొనుగోలు చేయడం సర్వసాధారణమని, యుద్ధంతో వాణిజ్య అంశాన్ని ముడిపెట్టడం తగదని సూచించారు. వాణిజ్య సమస్యలను పరిష్కరించే అధికారం కేవలం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో)కు మాత్రమే ఉందని, ఉత్తర అట్లాంటిక్ ఖండంలోని కొన్ని దేశాల సైనిక కూటమి నాటోకు వాణిజ్య ఒప్పందాల్లో ఎలాంటి ప్రమేయం, హక్కులు ఉండవని తేల్చి చెప్పారు.

వేల సంవత్సరాల చరిత్రలో ఏ దేశం మీదా దండయాత్రకు దిగని దేశంగా భారత్‌కు గుర్తింపు వుంది. భారత్ ఎప్పుడూ శాంతిపూర్వక వాతావరణంలోనే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆసక్తి చూపుతుంది. అది వాస్తవం. భారత ప్రధాని మోదీ గతేడాది ఆగస్టులో నాటి అమెరికా అధ్యక్షుడు బైడన్‌తో ఫోన్‌లో సంభాషిస్తూ రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతినెలకొనేలా చొరవ తీసుకోవాలని కోరారు.

ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో నాటో వంటి సైనిక కూటమి నుంచి శాంతి సూచనలు వినాల్సిన అవసరం లేదని భారత విదేశాంగశాఖ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. పునః వినియోగ ఇంధన వనరులతో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి ఆత్మనిర్భర్ దిశగా వెళ్తున్న భారత్, రష్యా, అమెరికా మొదలు పశ్చిమాసియా, ఆఫ్రికా దాకా వేర్వేరు ఖండాల్లోని దేశాల నుంచి ముడిచమురు, సహజ వాయువులను దిగుమతి చేసుకుంటోంది.

భారత ఇంధన భద్రత విషయంలో వేలుపెట్టే అధికారం ఏ దేశానికీ లేదు. అలాంటప్పుడు నాటోకు ఆ అధికారం ఎక్కడిదని పలుదేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ భారత్ నాటో హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుంటే, నాటో సభ్య దేశాలతో, ముఖ్యంగా అమెరికా దౌత్య బంధానికి స్వల్ప బీటలు పడే అవకాశముంది.

చైనా, భారత్ సారథ్యంలో పటిష్టమవుతున్న ‘బ్రిక్స్’ కూటమి ఇప్పుడు అంతర్జాతీయ మారకమైన డాలర్ ఆధిపత్యానికి గండికొట్టి ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తీసుకొస్తుందనే భయం అమెరికాను వెంటాడుతున్నది. అందుకే అమెరికా కనుసన్నల్లో ఉండే నాటో లాంటి సైనిక కూటమితో పరోక్ష హెచ్చరికలు చేస్తోందని సంకేతాలున్నాయి.

యుద్ధానికి వాణిజ్యంతో ముడిపెట్టడం సరికాదని, అంతర్జాతీయ వాణిజ్య విభేదాలను పరిష్కరించేందుకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో) ఉండనే ఉంది. మరి డబ్ల్యూటీవో విధుల్లోకి నాటో ఎందుకు తలదూర్చుతోందన్న విమర్శలు అన్ని వైపుల నుంచి మొదలయ్యాయి. అమెరికా స్వప్రయోజనాలు కాపాడే డమ్మీ వాణిజ్య విభాగం స్థాయికి నాటో పడిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.