19-07-2025 12:00:00 AM
వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారిశుధ్యం పడకేసింది. ఇళ్ల మధ్యనే కాకుండా కాలువల్లో మురుగు పేరుకుపోతున్నది. ఖాళీ స్థలాల్లో చెట్ల పొదలు పెరుగుతూ ఆపరిశుభ్రత తాండవిస్తోంది. మురుగు కారణంగా దోమల వ్యాప్తి పెరుగుతూ రాత్రిళ్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర నిధులు నిలిచిపోయి గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.
కనీసం బ్లీచింగ్ చల్లించలేని పరిస్థితి ఏర్పడింది. వర్షాల ప్రభావంతో దోమల విజృంభణ పెరిగినా, ప్రజలు రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఫాగింగ్ యంత్రాలు కొన్ని చోట్ల అలంకారప్రాయంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 471 పంచాయతీలు ఉండగా, 339 యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఆ 339 ఫాగింగ్ యంత్రాల్లోనూ చాలావరకు సక్రమంగా పనిచేయడం లేదు. జిల్లాలో ఏటా గిరిజన గ్రామాల్లో డెంగీ, మలేరియా తదితర విషజ్వరాలు ప్రజలుతున్నాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించాల్సి ఉండగా.. అది కూడా అమలు కావడం లేదు.
జగ్‌మోహన్, కొత్తగూడెం