19-10-2025 05:42:12 PM
ఏఐటీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాల్ రాజు..
కరీంనగర్ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి కోఆపరేటివ్ సొసైటీ సెంటర్స్ లలో పనిచేస్తున్న హమాలీ కార్మికులందరికీ ప్రభుత్వం ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఒకే రకమైన కూలి రేట్లు ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాల్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జిల్లా ఐకెపి కోఆపరేటివ్ సొసైటీ సెంటర్స్ హమాలీ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే పని ఉండే హమాలీ కార్మికులు చాలీచాలని కూలీలతో తమ కుటుంబాలను పోషించుకుంటూ అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు మేలు చేస్తున్నారని, హమాలీల కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదని, రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని హమాలీల కూలి రేట్లు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, జిల్లా ఐకేపీ, కో - ఆపరేటివ్ సొసైటీ సెంటర్స్ హమాలీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు నెల్లి రాజేశం, ప్రధాన కార్యదర్శి కటికరెడ్డి బుచన్న యాదవ్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల సమ్మయ్య, హమాలీ కార్మిక సంఘం జిల్లా నాయకులు జంగం లింగయ్య, ఓజ్జ కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.