21-08-2025 07:54:59 PM
ఎమ్మెల్యే దొంతిని వేడుకుంటున్న గురిజాల వితంతు మహిళ..
నర్సంపేట (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తన ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యిందని, ఉండడానికి కనీసం నిలువ నీడ లేకుండా పోయిందని, ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన వితంతు మహిళా మొగులోజు శారద గురువారం నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhava Reddy)ని పత్రికా ముఖంగా వేడుకుంది. గతంలో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల లీస్ట్ లో నా పేరు తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్లు లేని నిరుపేదలైన అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి కానుకగా ఇస్తుందని, ఇందిరమ్మ ఇల్లుకు నేను అర్హురాలునని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేలమట్టమైన తన ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఎమ్మెల్యే దొంతి మంజూరు చేయిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. గత కొన్ని నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సన్న బియ్యంతో సంతోషంగా ఉన్నానని, అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టిచ్చి ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటానని వితంతువు శారద విజ్ఞప్తి చేసింది.