ఆమ్ ఆద్మీకి ఎదురుదెబ్బ!
రాఘవ్ చద్దా సహా ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ ఫిరాయించడంతో ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం పది మంది సభ్యుల్లో ఏడుగురు కమలం తీర్థం పుచ్చుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు ఆప్‌నకు వచ్చిన నష్టమేమీ లేకపోయినా ఆ పార్టీలో వైరుధ్యాలు మరోసారి బయటపడినట్టయ్యింది. మూడింట రెండొంతుల మంది ఎంపీలు పార్టీ మారడంతో రాజ్యసభలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల రాజ్యసభలో ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని కోల్పోయిన చద్దా తన తో పాటు మరో ఆరుగురిని వెంటతీసుకుపోవడం గమనార్హం.
అయితే, వీరి లో తాజాగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమితులైన అశోక్ మిత్తల్ కూడా ఉండటాన్ని ఆప్ ఊహించలేకపోయిందనే చెప్పాలి. పార్టీ ఫిరాయించిన వారిలో రాఘవ్ చద్దాతో పాటు అశోక్ మిత్తల్, కొంతకాలంగా ఆప్‌నకు దూ రంగా ఉంటున్న స్వాతి మలివాల్, సందీప్ పాఠక్, హర్భజన్‌సింగ్, రాజీందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ ఉన్నారు. అయితే, వెళ్తూ వెళ్తూ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీపైనా, అరవింద్ కేజ్రీవాల్‌పైనా తీవ్రమైన ఆరోపణలు చేయడం గమనార్హం.
సామాన్యుడి పార్టీగా పేరొందిన ఆప్ సామాన్యులకే దూరమైందని, ప్రజల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల ఆ పార్టీ కోసం పనిచేస్తోందని, వారి అవినీతిలో తాను పాలుపంచుకోనని పరోక్షంగా కేజ్రీవాల్‌పై చద్దా విమర్శలు ఎక్కుపెట్టారు. చద్దా ఆరోపణలను ఆప్ తిప్పికొ ట్టిం ది. గతంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌పై తప్పుడు కేసు బనాయించి లబ్ధిపొందిన బీజేపీ, వచ్చే ఏడాది పంజాబ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆపరేషన్ లోటస్‌కు తెరదీసిందని ఆప్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
అశోక్ మిత్తల్‌ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించిన వెంటనే ఆయనకు చెందిన వ్యాపారాలు, లవ్లీ యూనివర్సిటీపై ఈడీ దాడులు చేయడమే ఇందుకు నిదర్శనమని ఆప్ వాదిస్తోంది. ఈ ఆరోపణలను పక్కనపెడితే, ఆప్‌ను స్థాపించిన నాటినుంచీ ఆ పార్టీలో ఉన్న నాయకుల్లో రాఘవ్ చద్దా కూడా ఒకరు. గతంలోనూ పార్టీ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ పార్టీ నాయకత్వంతో పొసగక బయటికి వెళ్లిన విషయం విదితమే.
ఇప్పుడు చద్దా ఘటనతో రాజకీయ ప్రత్యర్థులు, విశ్లేషకులు మరోసారి గతాన్ని తవ్వుతున్నారు. విలువలతో కూడిన రాజకీయాలు, అవినీతిలేని పాలన అంటూ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను, సామాన్యుడికి దూ రమైందన్న అపవాదును చెరిపివేసుకొని ఎలా ముందుకెళ్తుందో చూడాలి.






