జీపీ డీపీతో గ్రామాభివృద్ధి వేగం
20-06-2026 01:33 AM
అలంపూర్, జూన్ 19: గ్రామాల్లో ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం సాధించేలా గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక లను రూపొందించాలని సింగవరం-1 సర్పంచ్ గొంగళ్ల ఈశ్వర్ అన్నారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ...16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4.35 లక్షల కోట్ల నిధులు కేటాయించడం గ్రామాభివృద్ధికి గొప్ప అవకాశమని తెలిపారు.
తెలంగాణకు ఐదేళ్ల కాలానికి రూ.9,968 కోట్లు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,280 కోట్లు కేటాయించబడిన నేపథ్యంలో సర్పంచ్లు ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. స్థానిక మానవ వనరులు, ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.






