08-11-2025 07:50:27 PM
* అధికారుల నిర్లక్ష్యం వాహనాదారుల పాలిట శాపం
* రహదారిపై గుంతలు పూడ్చి వాహనదారుల ప్రాణాలు కాపాడాలి
* గడ్డిపల్లి గ్రామస్తుల ఆవేదన
గరిడేపల్లి (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యంతో వాహనదారులకు ప్రమాదాలు తప్పడం లేదు. మండల కేంద్రం నుండి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి గుండా వెళ్తున్న గడ్డిపల్లి గ్రామం వద్ద రహదారిపై గత కొంతకాలంగా నీరు నిల్వ ఉండటంతో భారీ గుంత ఏర్పడింది. ఇట్టి విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శుక్రవారం రాత్రి మండల పరిధిలోని గానుగ బండ గ్రామానికి చెందిన పొంగబాల సైదులు గరిడేపల్లి నుండి సూర్యాపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చీకటిలో గుంతను గుర్తించకపోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. కాగా బాల సైదులు తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 కు సమాచారం అందించి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చి వాహనదారుల ప్రాణాలను రక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.